పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడవచ్చిరి. బలముగా ద్వాదశోర్ద్వపుండ్రములను ధరించి యొక వైష్ణవస్వామి పల్లకిలోఁ గూరుచుండి యిరుప్రక్కల నిద్దఱు వింజా మరలు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుఁగ నూరేగుచుండెను. ఆ వెనుక కొందరు తెలగాణ్యులును నొక వైష్ణవుఁడును గంధములు పూసికొని తాళవృంతములతో విసరుకొనుచు నడచుచుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖరుఁడుగా రెఱుఁగుదురు గనుక దగ్గఱకు పిలిచి యీ ప్రకారముగా ముచ్చటింప నారంభించిరి:

రాజ__మీరు ధవళేశ్వరములో నున్న గూడూరు వారికి గురువులు కారా?

వైష్ణ__అవును, ఆ పల్లకీలోఁ గూర్చున్నవారికీ గ్రామములో వారికి నవసరాలవారు శిష్యులు.

రాజ__వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీ కాయన శిష్యుఁడుగాను ఉండెడివారు కారా?

వైష్ణ__మాలో మా కటువంటి భేదము లేదు. నాకు శిష్యు లున్న గ్రామములో నతఁడు శిష్యుఁడుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుఁడుగాను మాఱుచుందుము. ఆయన తాతయు మా తాతయు సహోదరులు; వారి తండ్రి ప్రతివాది భయంకరము గండభేరుండాచార్యులవారు జకదేక పండితులు. వారు పరమపదమునకు వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మా తాతలను తండ్రులను పాళ్ళు వేసికొని పంచుకొన్నారు. ఈ గ్రామములోని వారు మావాని వంతునకు ధవళేశ్వరములోనివారు నా వంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన శ్రీకూర్మము విడిచి యీ ప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము చేయుదుము.

రాజ__వెనుక మీ రాయనకు చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి యుపదేశము చేయును?

వైష్ణ__ఆయనకెంత చదువు వచ్చునో నాకు నంతే వచ్చును. శిష్యుల కుపదేశించుట కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నష్ణోత్తర శతము జపము చేసికొమ్మని