పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలుకొని వీధిలోనికి వచ్చిన నెవ్వరేమి చేసెదరో యను భీతిచేత మీ బావమఱఁది లోపల తలుపువేసికొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండు మూడు దినములు జరిగిన పిమ్మట దామోదరయ్య లోపల తలుపువేసికొని కూరుచుండి యేమో పాతాళ హోమము చేయుచున్నాఁ డని గ్రామములో నొక వదంతి కలిగిన దనియు, ఆవల గ్రామములోని వారందఱును నాలోచించి యందఱకును కీడుగలుగుటకై యేదో మహా మంత్రమును పునశ్చరణ చేయుచున్నాఁడుకాని వేఱు కాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినఁగాని తమకు బ్రతుకు లేదని గోదావరి యొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట మొదలుగా గల పని యంతయు జరిగిన దనియు, ఆతఁడు చెప్పెను. నేనును పది దినముల కర్మయు జరిగినదాఁక వారి యింటనే యుండి, పదమూడవ నాడు బయలుదేఱరాదు గనుక పదునాలుగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగాఁ దీసికొనిపోయి మా నగల పెట్టెను నారాయణమూర్తి తమ యింట దాఁచుట చెప్పి తనకు నూఱు రూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతని కియ్యక నిలిపియుంచెద ననియు, మీ మామగారిని చూచి వచ్చినతోడనే తగవుపెట్టవలసిన దనియుఁ జెప్పెను. నేనును మంచిదనీ చెప్పి మీకొఱకు వెదకు కొనుచు వచ్చితిని."

అని శంకరయ్య తన తండ్రి సంగతి యంతయుఁ జెప్పి మూఁటను విప్పి కాసుల పేరును దీసి రాజశేఖరుడుగారి చేతికిచ్చెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని కౌగిలించుకొని యూరార్చాచు, దామోదరయ్య పోయినందుకుఁ గొంత తడవు విచారించెను; అప్పు డింటనున్నవా రందఱును దామోదరయ్య నిమిత్త మొకసారి రోద నముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్న మంతయు లోకవార్త లతో పొద్దు జరిగినది.

దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యముల చప్పడు వినఁబడి నందున రాజశేఖరుడు మొదలగువారందఱును వీథిలోనికి