పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతి మాసమును రెండు పక్షముల యందును ముఖ మంటపము మీఁద ఏకాదశినాఁడు రాత్రి హరి భజనము జరుగుచుండును. హరి భక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వ పుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని, కరతాళములను మృదంగ ములను మ్రోగుచుండఁగా తంబురలుమీటుచు.. బిగ్గఱగాఁ దమ యావచ్చక్తిని "నవనీత చోరా" "గోపికాజారా" "రాధికాలోలా" గోపాలబాలా' మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగురుపోయినప్పడు మిరియములను బెల్లపు ముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయుఁ జూపి చేతికొలఁదిని వాయిం చుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలి పోవుటయు సంభవించుచుండును. దేవతావేశముచేత తఱచుగా భక్తులలో నొక ఱిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషములవఱకు వెనుకకు స్తంభము మీది కొఱగు చుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుఁగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చ చేష్టలవలెఁ గనఁబడునుగాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలఁతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండమీఁదికెక్కి నలుఁగడలఁ జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు చెంగుచెంగునఁ దమముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్ల మీఁదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలను, పూర్వదక్షిణములఁ గుప్పవోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తగా నొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపైనుండి పొలము కాపులు కో యని కూఁత లిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదిరింపఁ జేరువ తోపులలోనుండి వెలువడి మధుర రుతములు చేయుచు ఆకాశ మున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలు విధములయిన పక్షులు చెట్ల కొమ్మలమీఁదఁ బెట్టుకొని తినుచుండ

16