పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపురస్కారములు లేక బూజుపట్టియున్నయాదేవరనుత్సవదినములలో నర్చకుండొకఁడు పైకిఁ దీసి పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహాముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం దలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్ధనస్వామి కళ్యాణదినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథముయొక్క పగ్గముల నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్న దేవర యెడం గల విశ్వాసముచేత పూజారులు మఱుచటి సంవత్సర మా త్రాళ్ళపని మఱల వచ్చువఱకును ఆ గుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయి దేవతా సందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులు మాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెుదట నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహ తంత్రము నంతయు మహావైభవముతో నడిపింతురు.

15