పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖరుఁడుగా రేమో విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మన్నారని చెప్పి, ఆయనను వెంటఁబెట్టుకొని పోయెను. ఆయన వెళ్లునప్పటికి సమస్తాభరణ భూషితు లయి రాజుగారు రత్నసింహాసనము మీఁద గూరుచుండియుండగా, నేత్రహస్తులు పసిఁడిబెత్తములను చేతఁబూని ముందు నిలుచుండిరి. చామరధరు లిద్దఱు ప్రక్కల నిలుచుండి వింజామరలు వీచుచుండిరి; భటు లాయుధపాణులై పార్శ్వములను నిలుచుండిరి; ఒక ప్రక్కను శోభనాద్రిరాజు చేతులు జోడించుకొని నిలుచుండెను; రెండవప్రక్కను మఱి యిద్దఱు మనుష్యులు చేతులుకట్టుకొని నిలువఁబడి యుండిరి; రాజశేఖరుఁడుగారు వచ్చి యెదుట నిలువఁబడగానే కృష్ణజగపతిమహారాజులుగారు "మీ రీ శోభనాద్రిరాజుగారి మీఁద నేమైన మా పేర మనవిచేసుకొన్నారా?"అని యడిగిరి. రాజశేఖరుఁడుగారు తన మీఁది కేమివచ్చునో యని భయ పడుచు, శరీర మంతయు కంపమునొంద నోరు మెదల్చక యూర కుండిరి.

కృష్ణ__శోభనాద్రిరాజా! నీవీ రాజశేఖరుఁడుగారి విషయ మయి చేసిన యక్రమపు పను లన్నియు మాకుఁ దెలియవచ్చినవి. నీకు చనవరిగానున్న తుచ్ఛునకు తన కొమార్తె నియ్యనన్న మాత్ర మున, నీ వాయనను పట్టి చెఱసాలయందుఁ బెట్టుటయేకాక చెఱసాలలో నున్న వాండ్ర నిద్దఱను విడిచిపుచ్చి యాచిన్నదాని నెత్తుకొనిపోవునట్లు ప్రేరేపించితివి.

శోభ__ఆ చిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియదు.

కృష్ణ__నీకుఁ దెలియకపోయిన యెడలఁ జెఱసాలలో నున్న వీండ్రిద్దఱును నెట్లువెలుపలికిఁ వెళ్ళఁగలిగిరి?

శోభ__వీండ్రిద్దఱును నిన్నటియుదయకాలమున గోడదాటి పాఱిపోయినారు. నేనప్పటినుండియు వీండ్రను బట్టుకొనుటకు భటులను బంపి వెదకించుచున్నాను.

కృష్ణ__ఏమిరా, గురవా! మిమ్మాయన యెక్కడికయిన పంపినాఁడా? లేక మీరే గోడదూకి పాఱికిపోయినారా?