పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని పెద్ద పెట్టున నేడ్చెను. మాణిక్యాంబయు దుఃఖము పట్టఁజాలక కొంతసేపు తానుకూడ నేడిచి తన పైఁట చెఱఁగుతో కొమార్తె కన్నులనీళ్ళ తుడిచి నిన్నఁటి నుండియు నెక్కడకుఁ బోయితి వనియు నింత చీకటిలో నొక్కతెవు నెట్లురాఁ గలిగితి వనియు సీత నడిగెను. ఆ క్రిందటి దినము ప్రొద్దుననే తన్నిద్దఱు దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజును మఱియొక చిన్నవాఁడును తన్ను విడిపించి తీసికొని వచ్చుటయు, రామరా జేదోపనియున్నదని యూరి వెలుపలిదాఁక వచ్చి వెళ్ళిపోవుటయు,సీత చెప్పెను. అప్పు డారెండవ చిన్నవాఁ డేమయినాఁడని తల్లి యత్యాదరముతో నడిగెను. తనతో గూడ పయి వీధివఱకును వచ్చినాఁడనియు, అతఁడు పూర్వము తమ్మందఱి నెఱిగినవాఁడే యనియు, కొంచెము సేపటికెల్ల నిచ్చటికి వచ్చుననియు కూఁతురు బదులు చెప్పెను. ఈ ప్రకారముగా మాణిక్యాంబ సీతను తొడమీఁద గూరుచుండఁ బెట్టుకొని మాటాడు చుండఁగానే సూర్యోదయమాయెను. అప్పడు వీధి గుమ్మములో నెవ్వరో “రాజశేఖరుఁడుగారి బస యొక్కడ?" అని యడిగిరి. ఆ మాట విని యది రుక్మిణి కంఠమువలె నున్నదని యొడిలోనుండి సీతను దింపి మాణిక్యాంబ వీధి గుమ్మములోని కొక్కయంజవేసి యెవరువా రని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయఁడు మాణిక్యాంబను జూచి, "అమ్మా' యని కౌగిలించుకొని బోరున నేడువ మొదలుపెట్టెను. అంతట వారందఱును గలిసి లోపలికిఁ బోయిరి.

చెఱసాలలో పెట్టఁబడిన దినముననే రాజశేఖరుఁడుగారు వ్యసనపడుచు నొకచోటఁ గూరుచుండి యుండఁగా ఏబది సంవత్సరములు దాఁటిన కారాబద్ధుఁ డొకఁ డామార్గమున కాళ్ళ సంకెళ్ళతోఁ బోవుచు రాజశేఖరుడుగారి మొగము వంక గొంత తడవు చూచి యాయన సమీపమునకు వచ్చి కూరుచుండెను.

రాజ__నీపే రెవరు?

కారా__నా పేరు పాపయ్య; మా యింటిపేరు మంచిరాజు వారు. నన్నెక్కడనై న జూచినట్టు జ్ఞప్తియున్నదా?