రాజ__మీ మొగ మెక్కడనో చూచినట్టే యున్నది కాని యెప్పుడు చూచినానో మాత్రము స్మరణకు రాలేదు. మంచిరాజు పద్మరాజు మీకేమగును?
పాప__నన్ను మీరు నల్లచెఱువు వద్ద జువ్విచెట్టు క్రిందఁ జూచినారు. నే నప్పడు బైరాగి వేషముతో నున్నందున, నన్నానవాలుపట్టలేక పోయినారు. పద్మరాజు నా కొమారుఁడు.
రాజ__మునుపటియవస్థ పోయి మీ కింతలో నిప్పటికీ దశ యెట్లు వచ్చినది?
పాప__నేనీ శోభనాద్రిరాజుతో స్నేహముచేసిన దోషము చేత, నా కీతనిమాట వినవలసి వచ్చినది. ఈ రాజు దారులుకొట్టుటకై నలుగురిని తోఁడిచ్చి నన్ను వారికి నాధునిగాఁ జేసి నల్ల చెఱువునకు పంపెను. వెనుక కోయ రామిరెడ్డియు వాని మనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్ల కొమ్మలకు ఉరితీయబడిన తరువాత మేమే ప్రబలులముగానుండి రెండు మాసములు త్రోవలు కొట్టటలోఁ బ్రసిద్ధిగాంచితిమి. దోచుకొని తెచ్చిన సొమ్ములో సగము శోభనాద్రిరాజు పుచ్చుకొనుచుండెను. మిగిలిన సగములోను సగము నా వంతునకు వచ్చుచుండెను. మెట్టు సొమ్ములో నాలవ పాలును తక్కినవారు నలువురును సమభాగములుగా బంచుకొను చుండిరి. నేను యోగివలె నటింపు చుందును; నాతోడ నున్నవారు దూరముగా నడవిలోఁ బగలెల్ల నుండి రాత్రులు వచ్చి మాటాడి పోవు చుందురు, పగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చి నప్పుడు, గుడిసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి బ్రత్యేకముగా నేనే జీతమిచ్చెడివాఁడను.
రాజ__ఆప్పుడు విల్లును అమ్ములను బుచ్చుకొని మాతో వచ్చినవాఁడు వాడేకాఁడా?
పాప__ఆవు నాబానపొట్టవాఁడే, మీ నిమిత్తమై పంపిన నాఁటి రాత్రియే యా నలుగురిలో నొకఁడు చంపఁబడినాఁడు. రాజు గారి కేలాగునఁ దెలిసెనోకాని మఱునాఁడు తెల్లవారక మునుపే రాజ