రామ__ఈ వ్రతము మిక్కిలి చిత్రముగా నున్నది. ఇటువంటి వ్రతము నే నీవఱకు వినియు కనియు నెఱుఁగను.
ఈ విధముగా మాటలు చెప్పుకొనుచు వారు దీపములు పెట్టిన నాలుగు గడియలకు భీమవరమునకు సమీపమున నున్న యొక చిన్న పల్లె ను జేరిరి; ఆక్కడనుండి త్రోవ మంచిది కాక పోవుటచేతను, రెండు దినముల క్రిందట నా యూరి బయటనే పెద్ద పులి యొక మనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలో వారిని నడిపించుకొని పోవుట యుక్తము కాదని రామరాజు వారి నా గ్రామములో నొక కాపువాని యింటఁ బరుండఁ బెట్టెను. ఆ పల్లెలో బ్రాహ్మణులు లేరు గనుక వారా రాత్రి భోజనము చేయకపోయినను, రామరాజు కోమటి యింటికి వెళ్ళి యటుకులను దెచ్చి వరున్న యింటి వాండ్రకు పాడియౌటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారి కిద్దఱికిని బెట్టెను. వానితో క్షుత్తు నివారణమైనందున వారును బస వాండ్రిచ్చిన తుంగ చాపమీఁద పడుకొని హాయిగా నిద్రపోయిరి. రామరాజు జాము రాత్రియుండగానే వారిని లేపి తనతోగూడ దీసి కొని బయలుదేఱి రెండు గడియలలో భీమవరము చేర్చి, యూరి బయటకు రాఁగానే తానావరకు మఱచిపోయిన గొప్ప సంగతి యేదో తనకప్పు డకస్మాత్తుగా జ్ఞప్తికి వచ్చినట్టు నటించి తొందరపడి తనకు వెంటనే వెళ్ళక తీరనిపనియున్నదని చెప్పి వారికి త్రోవచూపి తాను ప్రక్కదారిని పోయెను. వారిద్దఱును దారి యడిగి తెలుసుకొనుచు కొంత దూరము కలిసి వచ్చిరి. సీత తా నెఱిగియున్న వీధికి రాఁగానే సుబ్బరాయని వెనుక దిగవిడిచి పరుగెత్తుకొనిపోయి యొక సందులో నుండి మరలి తిన్నఁగా నింటికిఁబోయి చేరెను. సుబ్బ రాయఁడు చీకటిలో సీతపోయిన సందును కనిపెట్టలేక తిన్నగా వీధి చివరదాఁక నడచి యిల్లు కనుగొనలేక గ్రామములో తిరుగుచుండెను. సీత వెళ్ళి వీధి గుమ్మము వద్ద పిలువఁగనే మంచముమీఁద పరుండి నిద్రపట్టక విచారించుచున్న మాణిక్యాంబ త్రుళ్ళిపడిలేచి పరుగెత్తుకొని వచ్చి తలుపు తీసెను. తలుపు తీసినతోడనే సీత తల్లిని కౌఁగిలించు