పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. నా దేహము బలపడఁగానే యింటసహిత ముండనీయక నన్ను తఱిమి వేయుదురు.

రాజ__జరిగిపోయినదానికి విచారించిన ఫలమేమి? మీరిక సంసారసుఖములను మఱచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును జపించుకొనుచు ముక్తిమార్గమును జూచుకొండి.

సుబ్బ__నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మీకుఁ జేసిన యపకారమును మఱచి నన్ను మన్నింపవలెను.

రాజ__మీరు నాకేమి యపకారము చేసినారు?

సుబ్బ__చేసినపాపము చెప్పినఁబోవునని పెద్దలు చెప్పుదురు. మీరు మొన్న సీతనిచ్చి వివాహముచేసి నతఁడు ధనవంతుఁడుకాఁడు. ఆతఁడు శోభనాద్రి రాజుగారికి ముండలను తార్చువాఁడు. అతఁడు ధరించిన వస్త్రములు మురుగులు మొదలయినవి రాజుగారివే, రాజుగారీ యంత్రమును పన్ని నన్ను మీ దగ్గరకుఁ బంపిన నేనువచ్చి కార్య సంఘటనము చేసినాను. ఇంతకును దైవసంకల్ప మట్లున్నది కాబట్టి కార్యము జరిగిపోయినది. మీరన్నట్లు జరిగిపోయినదానికి విచారించిన ఫలములేదు.

రాజ__శోభనాద్రిరా జంతటి దుర్మార్గుcడా? ఆతని సంగతి నేను మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈ కపటము తెలియక రూపాయలు చేతిలోఁ బెట్టినప్పుడు నామీఁది యనుగ్రహము చేతనే యిచ్చుచున్నాఁ డనుకొన్నాను. రామరాజు ధర్మమా యని వివాహము కాకపోఁబట్టి సరిపోయినది కాని, లేకపోయిన యెడల నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే.

సుబ్బ__వివాహము కాదని మేలువార్త విన్నాను. నిశ్చయమైనకార్య మెట్లు తప్పిపోయినది?

రాజ__మా జ్ఞాతి యొకఁడు కాలము చేసినట్టు మయిల వర్త మానము వచ్చినందున మీరు పెట్టిన లగ్నమున శుభకార్యము కాలేదు.