పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రాజ__నావద్ద నీవేమి యయోగ్యతను కనిపెట్టినావు? ఇక ముందు నీ వెప్పుడును మా యిల్లు త్రొక్కిచూడవద్దు.

రామ__నీవు నీ వనఁబోకు. నీ యింటి జోలి యెవరికిఁ గావలెను?

అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను. అతని వెను కనే బయలుదేరి రాజశేఖరుడుగారు శోభనాద్రిరాజుగారి యింటికి బోయి, జరిగిన యావద్వృత్తాంతము వినిపించి; మరల ముహూర్తము పెట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనిని చెప్పిరి.

శోభ__మీలోపల ముహూర్తము పెట్టిననాఁటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, వ్యాధి ప్రబలమయి జీవితాశపోయినందున మంగళవారమునాఁడు మధ్యాహ్నమున ఆయనను భూశయనము చేసి నారు. అప్పు డాయన బంధువు లందఱును జేఱి చదువుకొన్న బ్రాహ్మ ణుల కిటువంటి చావు యోగ్యమయినది కాదని యాతురసన్యాస మిప్పించినారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నాడట. మీరిప్పడే పోయి యీ మాసములో వివాహముహూర్త మెప్పుడున్నదో విచారించి రండి.

రాజ__చి త్తము, సెలవు పుచ్చుకొనెదను.

అనిలేచి తిన్నగా సుబ్బరాయఁడు సిద్ధాంతిగారి యింటికిఁ బోయి చావడిలో పీటమీఁద గోడకుఁ జేరగిలబడి కూరుచుండియున్న యాయ నకు నమస్కరించి, దేహము స్వస్థముగా నున్నదాయని రాజశేఖ రుఁడుగారు కుశలప్రశ్నము చేసిరి.

సుబ్బ__కొంత వఱకు నెమ్మదిగా నున్నది. నా రోగము ప్రబలముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తు నపహరింప వలెనని నా జ్ఞాతు లందఱును జేరి నాకు సన్యాసమిప్పించి నారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకు వచ్చి యాఱునెల లయినది. దానితో పట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్యమనుభవింప