పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుబ్బ__ఈ మధ్యాహ్నమే నేను చూచినాను. ఇక చిన్న దానిని నిలిపి యుంచరాదు; మొన్న మా బంధువుల గ్రామములో నింతకంటె చిన్నపిల్ల సమర్తాడినది.

శోభ__ఎక్కడనై న సంబంధము విచారించినారా?

సుబ్బ__పెద్దాపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నము చేసెడిపక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును.

శోభ__అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నదానిని చేసికొనుట కంగీకరింతురా?

రాజ__తమ రేలాగుననైనను ప్రయత్నముచేసి మా కీమేలు చేయక తప్పదు. తమరు సెలవిచ్చినతరువాత వారు మఱియొక విధముగాఁ దలఁచుకోరు.

శోభ__ఈ పూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో చెప్పెదము. ఓరీ, స్వామిగా! మన బావగారితో మంచిరాజు పద్మరాజుగారు వచ్చి మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళఁ బోవునప్పుఁడొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మఱి వెళ్ళు మన్నానని మనవిచేసి రా,

లంపతావాఁడు వెళ్ళిన కొంతసేపటికి ముప్పదియేండ్ల యీడు గల నల్లని యొక పెద్దమనుష్యుడు చలువచేసిన తెల్లబట్టలు కట్టు కొని పదివ్రేళ్ళను ఉంగరములును చేతులను మురుగులును మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. శోభనాద్రిరాజుగారు దయచేయుఁడని మర్యాదచేసి యాయనను తమదాపనఁ గూర్చుండఁ బెట్టుకొనిరి.

పద్మ__తమ సెల వయినదని సామిగాఁడు వర్తమానము చెప్పినందున వెళ్ళుచున్నవాఁడను మరలి వచ్చినాను. నాతో నేమ యిన సెలవియ్యవలసినది యున్నదా?

శోభ__వీరు కొంతకాలమునుండి మన గ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి దొడ్డవారు. వీరి పేరు రాజశేఖరుఁడుగారు.