సంబంధము చేసికొందురో లేదో, ఆది మీకు సమకూడిన యెడల మీకు సర్వవిధముల ననుకూలముగా నుండును.
రాజ__వారిదేయూరు? మనమేమి ప్రయత్నముచేసిన ఆ సంబంధము లభ్యమగును ?
సుబ్బ__వారిది పెద్దాపురము. వారియింటిపేరు మంచిరాజు వారు; వారికి సంవత్సరమునకు రెండువేల రూపాయలు వచ్చు మాన్యము లున్నవి: ఇవిగాక వారియొద్ద రొక్కముగూడ విస్తార ముగా నున్నదని వాడుక చిన్నవాఁడు ప్రథమ వరుఁడు; స్ఫురద్రూపి: అతనికొక్క యన్నగా రున్నారుగాని, ఆయనకు సంతానము లేదు, ముందు సమస్తమునకును ఈ చిన్నవాఁడే కర్తయగును. పెండ్లి కొమారునిపేరు పద్మరాజుగారు. ఆ సంబంధము మన శోభనాద్రిరాజు గారు ప్రయత్నముచేసిన పక్షమున మీ యదృష్టబలమువలన రావలెను గాని మఱియొకవిధముగా మీకు లభింపదు.
రాజ__ఆలాగయిన పక్షమున, ఈ సంగతిని ముందుగా మీరొకసారి రాజుగారితో ప్రసంగించి వారి యభిప్రాయము తెలిసికొనెదరా?
సుబ్బ__నేను ముందు వెళ్ళి కూర్చుండెదను. తరువాత మీరు కూడా రండి. మీరుండగానే మాట ప్రస్తావనమున మీ కొమార్తె వివాహపు సంగతిని తెచ్చిచూచెదను. దాని మీద మీరందుకొని రాజు గారితో నొక్కి మనవి చేయవలెను.
అనిచెప్పి సుబ్బరాయఁడుసిద్ధాంతి బయలుదేఱి తిన్నగా శోభ నాద్రిరాజుగారియింటికి బోయి కూరుచుండెను, తరువాత మఱినాలుగు నిమిషములకు రాజశేఖరుడుగారును వెళ్ళి చేరిరి. అప్పుడు కొంత సేపు పలువిధముల ప్రసంగములు జరిగినమీఁదట రాజశేఖరుడుగారి కొమార్తె సంగతి సంగతి మెల్లఁగా దెచ్చెను.
సుబ్బ__రాజశేఖరుడుగారికి పెండ్లి కావలసిన కొమార్తె యున్న సంగతి దేవరవా రెఱుగుదురా?
శోభ__ఎఱుఁగుదుము: ఈ మధ్య విన్నాము, ఆ చిన్న దానికిఁ బెండ్లి యీడు వచ్చినదా?