Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దాపురము ప్రయాణము మానుకొని పది గడియల ప్రొద్దెక్కువఱకిల్లు చేరిరి.

నాఁడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడుగారు ప్రాతః కాలమునను సాయంకాలమునను గూడఁ బోయి శోభనాద్రిరాజుగారి దర్శనము చేయుచుండిరి. ఆ రాజుగారును మిక్కిలి దయతో నాతని నాదరించి మంచిమాటలతో సంతోషపెట్టుచుండిరి. ఆయన రాజకార్య విషయమైన పనినిజూచు చుండునపుడు సహితము రాజశేఖరుఁడు గారు వద్దనే యుండి సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలోని ప్రజలు వ్రాసికొన్న విజ్ఞాపన పత్రికలను కొలువుకాండ్రు చదువునపుడు వ్రాసికొన్న మనవి కడపట రెండు మూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదావళి మాత్రము మొదటి రెండు పత్రములలోను పూర్ణముగా నిండియుండుట తెలిసికొని రాజుగారికి గ్రామములోని కాపులకన్న బిరుదు పేళ్ళే విశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి. రాజకార్యపుఁబనియైనతోడనే రాజుగారు సభవారితో ముచ్చట కారంభింతురు. అతఁ డెంతసేపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పు చుండును; ఆ కథ లన్నియు నావఱకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి నవ్వినట్టే ప్రతిపర్యాయమును సభలోని వారందఱును నవ్వుచుందురు; అందులోఁ గొందఱు స్తోత్రపాఠములను చదివి రాజు గారి మనస్సును సంతోషపెట్టుచుందురు; అందఱును ముఖస్తుతులు చేయుచుండగా తామొక్కరును మాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు భయపడి యాతఁడు మఱి యే విషయమునందును స్తోత్రా ర్హుడుకా నందున మంచిబట్టలను కట్టుకొను టకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తఱచుగా రాజశేఖరుఁడుగారు రాజ స్థానమునందు మెలగుఁచు వచ్చుటచేత వేఱులాభమును పొందక పోయినను సభలో పదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాబట్టి యప్పటినుండియుఁ దామొకమాటను చెప్పుచు ముందుగాఁ దామే నవ్వుచువచ్చిరి. అది చూచి యందఱును నవ్వు