పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కయి నా కుమారుని ఇక్కడకు వచ్చిన తరువాతనే పిఠాపురము పంపినాను.

ఈ ప్రకారము సంభాషణము జరుగుచుండఁగా కొంతమంది పెద్దమనుష్యులు వచ్చి అరుగుమీఁదనున్న బల్లమీఁద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాము చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంస చేసిరి. చెప్పినమాటలలో నేమియు చమత్కారము లేకపోయినను, అక్కడ నున్నవా రాలోపమును లోనవ్వు మాత్రము పూర్తి చేసిరి; వారందఱు నవ్వినపుడు తామొక్కరు నూర కున్న బాగుండదని నిజముగా నవ్వు రాకపోయినను తెచ్చుకొని వారు నవ్వినప్పుడెల్లను రాజశేఖరుఁడుగారును నవ్వుచువచ్చిరి. ఆ రాజు తన్ను రాజశేఖరుఁడుగారు తెలిసినవాఁ డనుకొనుటకయి ప్రతి విష యములోను గొంచెము కొంచెముగా మాటాడి యన్నియుఁ దెలిసిన వానివలె నటింపసాగెను; తన కేమియుఁ జెప్పుటకు తోఁచనప్పుడు అక్కడనున్న వారి మొగములవంకఁ జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందఱు నూరక పొగడుచుండిరి. ఇంతలో గొందఱు గాయకులు వచ్చి సంగీతముపాడుట కారంభింపని యెడల, వారి పొగడ్తలు సభచాలించువరకు నుండుననుటకు సందే హములేదు. వారు పాటనారంభింపఁగానే యెల్లవారికిని ఇండ్లమీఁద ధ్యానము పాఱనారంభించినది. అయినను రాజుగా రేమను కొందురో యని యందఱును కొంతసేపు శ్రమచేసి మాటలు చెప్పుకొనుచు నచ టనే కూరుచుండిరి. ఆ పాట వినివిని తాళలేక కడపట నొక పెద్దమను ష్యుడు చొరవచేసి, "వారు మంచివారని యదేపనిగా శ్రమ యిచ్చుట న్యాయముకాదు. కాబట్టి యీ పాటి పాటచాలింప ననుజ్ఞ యియ్య వచ్చు" నని చెప్పెను. సభవారందరును అది యుక్తమని యేక వాక్యముగాఁ బలికిరి, అంతట సభచాలించి యందఱును సెలవుపుచ్చు కొని వెళ్ళఁబోవునపుడు రాజుగారు రాజశేఖరుఁడుగారిని'అప్పడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదఱుకాదా?" యని యడిగిరి,"ముఖ్యముగా వచ్చి దర్శనము చేసికొనుచుండెద"నని చెప్పి, ఆయన నాఁటికి