పదవ ప్రకరణము
శోభనాద్రి రాజుతో మైత్రి__సీత వివాహ ప్రయత్నము__ రామమూర్తి గారి మరణవార్త__రామరాజుతో విరోధము__రాజశేఖరుడుగారిని చెఱసాలలోఁ బెట్టుట__సీత నెత్తుకొని పోవుట.
ఒక యాదివారమునాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరు వాత రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకుఁ బోవుచుండగా, శోభనాద్రి రాజు వీధియరుగుమీఁదనున్న యున్నతాసనముపైని గూరుచుండి చూచి లంపతావాని నొక్కని బిలిచి "ఆ మార్గమునఁ బోవుచున్న బ్రాహ్మణుని దీసికొనిర"మ్మని చెప్పెను. వాఁడును మహా వేగముగా బోయి "రాజుగారి సెలవయినది ర"మ్మని పిలిచెను. రాజశేఖరుఁడుగా రెట్లయిన నాతని యనుగ్రహము సంపాదించుకోవలె ననియే కోరు చున్నవారు గనుక పిలిచినదే చాలునని వెళ్ళి అతఁడు చూపిన బల్ల మీఁద కూరుచుండిరి.
శోభ__ఈ నడుమ భీమవరము వచ్చి సోమభట్లుగారి లోపల కాపురమున్నవారు మీరే కాదా?
రాజ__అవును. వెనుక నేనొక పర్యాయము దమ దర్శనము చేసినాను.
శోభ__జ్ఞాపకమున్నది.మేమప్పుడు మిక్కిలి తొందర పనిలో నుండి మీమీఁద కోపపడినాము. అంతేకాకుండ ఆ వచ్చినవారు మీరని మాకప్పుడు తెలియలేదు. మీ పోష్యవర్గములో చేరిన వారెంతమంది యున్నారు? పెండ్లి కెదిగిన కొమార్తె కూడ ఉన్నదఁట కాదా?
రాజ__ఇప్పుడున్నది వివాహము కావలసిన యాకూఁతు రొక్కతయే. నా పెద్ద కుమార్తె మొన్న త్రోవలో దొంగలు కొట్టి నప్పుడు చనిపోయినది. ఏదయిన నొక యుద్యోగమును సంపాదించుట