పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనెంతసేపు చెప్పకొన్నను రాజు నోటినుండి యొక మాటయు బదులు రాలేదు. నేను మాటాడుట మొదలుపెట్టినతోడనే మంచము దగ్గరనున్న కుక్క యొకటి మొఱగనారంభించినది. కాబట్టి దానితోనే మాటాడినా ననుకొన్నాను. కాని యది యేమి చెప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ,రాజు తన సేవకుని నొక్కనిఁ బిలిచి నాకుఁ దెలిసిన భాషతో ఈ బ్రాహ్మణు నావలికిఁ బంపివేయుమని యాజ్ఞాపించెను. జరుగఁబోవు సంగతిని గ్రహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యింటికి వచ్చితిని.

ఆంతటి సన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్ధిపట్టక రాజశేఖరుఁడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునాయని యాలోచించి సుబ్రహ్మణ్యము నెక్కడ కైనను బంపవలెనని తలఁచి మాణిక్యాంబతోఁ జెప్పి యామె యనుమతిని కొమారునితో నా సంగతిని జెప్పిరి. అతఁడును పరమసంతోషముతో నొప్పుకొన్నందున, ఆందఱును నాలోచించుకొని చివర కతనిని పిఠాపురమునకుఁ బంప నిశ్చయించుకొనిరి. ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుడుగారు కుమారుని బిలిచి యనేక విధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునఁ బ్రవర్తింపవల సినదని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి యయిదు రూపాయలను కర్చునిమిత్తమిచ్చిరి:మాణిక్యాంబయు దగ్గర నున్న దానిలో నేమియు లోపము చేయక కావలసినన్ని దీవన లిచ్చెను. సుబ్రహ్మణ్యమును వారి నెడబాయవలసి వచ్చినదిగదా యని దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయ యలలో నొకదానిని చేతిలోఁ బెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుక తిరిగి చూచుచు దారిసాగి నడిచెను.