పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రము చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకి కొనుచుఁ దిరిగి యెందునేమియుఁగానక మరల నెప్పటిచోటునకువచ్చి, అచ్చట గొంతసేపు పచ్చిక బయలను గూరుచుండి యాపచ్చికను తన కన్నీటితోఁ దడిపి రుక్మిణిదేహము నేమృగములో యీడ్చుకొని పోయి యుండునని నిశ్చయము చేసికొని యీ దుర్వార్తను గొని పోయి యెట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి మెల్లగాఁలేచి కాళ్ళు తడఁబడ నడచుచు త్రోవపొడుగునను రుక్మిణి యొక్క సౌందర్యమును సుగుణసంపదలను దలఁచుకొని కన్నులనీరు నించుచు మధ్యాహ్నము రెండు జాముల కేలాగుననో యింటికి దేహమును చేర్చి నడవలో చాపమీఁద చతికిలఁబడి యేమో చెప్పఁబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచు నూర కుండిరి. అప్పుడు మాణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొని పోయి కంచు చెంబుతో మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిట చెఱగుతో మొగముమీఁది జెమ్మట తుడిచి విసనకఱ్ఱతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవఱకు పోఁగొట్టెను. అంత నతఁడును కొంత ధైర్యము నవలంబించి, కన్నుకొలకులనుండి నీరు కాలువలు కట్ట గడియకొక మాట చొప్పున దుఃఖమును మ్రింగుకొనుచు రుక్మిణి వార్తను జెప్పెను. అప్పుడందఱును పెద్ద పెట్టున గొల్లుమని రోదనముచేయ నారంభించిరి. అది విని సత్రపు బ్రాహ్మణుఁడును చుట్టుపట్ల వారును వచ్చి, వారికి వచ్చిన యాపదను దెలిసి కొని బహువిధముల వారి నూరార్చి భోజనమునకు లేవఁదీసిరి. వారును విస్తళ్ళ యొద్ద కూరుచుండి తినఁబోయిన మెతుకులు లోపలికిపోక కొంతసేపు కూరుచుండి విచారముతో విస్తళ్ళను వదలిపెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికిఁ బోయి వారు చేతులు కడుగుకొనుచుండఁగా కేకలు వేయుచు వీధిలోనుండి పరుగులెత్తు చున్న మనుష్యులయొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడి యేమో చూతమని వీధిలోనికి వచ్చునప్పటికి తూర్పువయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును గనఁబడెను. ఇంతలో