పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/123

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది


సత్రపు బ్రాహ్మణుఁడు వచ్చి కుమ్మరవీధి తగులఁబడుచున్నది, చూచి వత్తము రమ్మని రాజశేఖరుఁడుగారిని పిలిచెను; కాని యాతఁ డెంత దయార్ద్ర హృదయుఁ డయినను కొండంత దుఃఖములో మునిఁగి యున్నవాఁడు గనుక, నిల్లు కదులుటకు మనసు గొలుపక యూర కుండెను. సుబ్రహ్మణ్య మావఱ కెన్నఁడు నాపదల ననుభవించి యొఱుఁగని పసివాఁ డగుటచేత బరుల కాపద వచ్చినదన్న మాట వినినతోడనే తన యాపద మఱచిపోయి చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తా నా బ్రాహ్మణునితోఁ గూడ బయలుదేఱిపోయెను. వారక్కడకుఁ బోయి చేరునప్పటికి వేలకొలఁది జనులు వచ్చి వేడుక చూచుచుండిరికాని, వారిలో నొక్క రయినను ఆర్పుటకు ప్రయత్నపడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురుబొంగులు కణుపులయెద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు మ్రోగినట్టు మ్రోగుచుండెను, ప్రాతతాటాకులు పయికిలేచి గాలిలో తారాచువ్వలను తలఁపించుచుండెను. ఎండల వేడిమిచేత సమీపమున నున్న చెఱు వెండిపోయినందునను ఇంకిపోఁగా మిగిలిన నూతల లోని నీళ్ళు చేద మునుగుటకయిన వీలులేక పాతాళ లోకమునకు సమీపముగా నున్నందునను, నీళ్ళను తెచ్చుకోలేక అంటుకొన్న యిండ్లవాండ్రు పెణకలను లాగుటకు ప్రయత్నపడుచుండిరి; ఆ చేరువ యిండ్ల వారు తమ యింటిమీఁద తాటాకుల నయినఁ దీసిన మరల వేసికొనుటకయి శ్రమపడవలసి వచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న యిండ్ల వారు వేడుకొన్నను యియ్యక దాచిపెట్టుకొన్న కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పులమీఁది కెక్కి తమ యిల్లంటు కొనువఱకును నుండి నీళ్ళకుండ నక్కడనే దిగవిడిచి రోదనములు చేయుచు దిగుచుండిరి. మఱికొందరు తమ యిండ్లలోని సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిఁ దెచ్చి వీధిలోఁ బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండవ వస్తువుకొరకు వెళ్ళునప్పటికి పరో పకారపారీణులయిన మహాత్ములు కొందఱు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట జాగ్రత్త చేసికొనుచుండిరి.