గ్రహమువలనఁ గలిగిన యీ సౌఖ్యముల ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి యదృష్టవంతులు ఆహా! గ్రామములో నెప్పుడును మన కీవసంతకాల మింత మనోజ్ఞముగా నుండలేదుగదా?
సీత__అమ్మా! నేనిఁక నడవలేను. నన్నెత్తుకో,
మాణి__ఆ చెట్టదాఁక నడచిరా, అక్కడ యెత్తుగొనెదను. రుక్మిణీ, వెనుకపడుచున్నా వేమి? రెండడుగులు వేగిరము పెట్టు.
రుక్మి__అలవాటు లేకపోవుటచేత కాళ్ళ పొక్కులెక్కినవి. వేగిరము నడవలే కున్నాను.
రాజ__పసులకాపరివాని నడిగినాను. ఊరొక క్రోసున్నదంట! రెండుజాములు కావచ్చినది. ఏలాగునైనను కొంచెము శ్రమచేసి నాలుగడుగులు వేగిరము నడువవలెను.
మాణి__సీత నెత్తుకొని నడచుచున్నాను. ఆఁకలియగుచున్న దని యిది యేడ్చుచున్నది. మన కుడిచేతివైపున దూరమున నేమో మనుష్యుల మాటలచప్పడు వినవచ్చుచున్నది. అది యూరేమో మన మీ పూఁట అక్కడ దిగుదమా?
రాజ__ఎవ్వరో మనుష్యు లక్కడ తొందరపడి పరుగెత్తు చున్నారు; వారిలో నెవ్వరికైన నొకయాపద వచ్చియుండఁబోలును! శీఘ్రముగా వెళ్ళుదము రండి.
ఆని వేగముగా నడచి వారు మనుష్యుల కలకలములు వినఁ బడుచున్న ప్రదేశమునకు సమీపముగాఁ బోఁగా, మార్గమునకుఁ గొంచెముదూరములో దక్షిణపుదిక్కున మూగియున్న గుంపులోనుండి "శుద్ధిచేయుటకు మజ్జిగ" యని కేకలు వేయుచు కొందఱు పరుగెత్తు కొని వచ్చుచుండిరి. రాజశేఖరుఁడుగారు వాండ్రను జూచి యాసం దడి యేమని యడుగఁగా, వారిలో నొకగొల్లవాఁడు 'రాచకుమారుఁ డొకడు వడగొట్టి యారావిచెట్టు క్రింద పడిపోయినాఁ' డని చెప్పెను.
రాజ__మీ రాతని గొంతుకలోఁ గొంచెము నీళ్ళు పోయక పోయినారా?