పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొల్ల__మొట్టమొదట మేము నీళ్ళియ్యఁబోఁగా, శూద్రులము కాబట్టి మాచేతినీళ్ళు త్రాగనని యారాజు పుచ్చుకొన్నాఁడుకాఁడు. తరువాత దాహమునకు తాళలేక మాచేతినీళ్ళు త్రాగుటకొప్పుకొన్నాడు. కాని మా వారిలో పెద్దవాఁడు వచ్చి, శూద్రుఁడు రాజు నోటిలో నీళ్ళు పోసిన పాపమువచ్చునని చెప్పి, నీళ్ళు శుద్ధిచేయుటకై మజ్జిగనిమిత్తము మమ్ముఁబంపినాఁడు. మా పల్లె యిక్కడికి పావు క్రోసు దూరమున నున్నది. మీరు బ్రాహ్మణులుగాఁ గనఁబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్థ మున్నయెడల, వేగిరముపోయి యాతని గొంతుకలో నాలుగుచుక్కలు పోసి పుణ్యము కట్టుకొండి.

ఆ మాటలు విని రాజశేఖరుడుగారు రుక్మిణిచేతిలో నున్న మంచినీళ్ళచెంబును పుచ్చుకొని, చెట్టు దగ్గఱకు పరుగెత్తిపోయి గుంపులోనుండి త్రోవచేసికొని ముందుకు నడచి గుంపు నడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతితో నోరునుజూపి నీళ్ళు నిమిత్తము సైగచేయుచున్న యొక మనుష్యునిఁ జూచిరి. ఆ మూఁక లలో నొకఁడు నీళ్ళముంతను జేతిలో బట్టుకొని "ఈ రాజు నిష్కారణముగా జచ్చిపోవుచున్నాఁడు; ఏ దోషము వచ్చినను నీళ్ళు పోసి బ్రతికించెద" నని చేరువకుఁ బోవుచుండెను. అప్పు డొక్క-ముసలివాఁ డడ్డము వచ్చి వానిచేయిపట్టుకొని నిలిపి, “ఈవరకుఁ బూర్వజన్మములో మనమెన్నియో పాపములను జేయుట చేతనే మనకిప్పు డీశూద్ర జన్మము వచ్చినది. ఇప్పు డీరాజును జాతి భ్రష్ట్రునిజేసి యీ పాపము సహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళు పోయవలద”ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిల వైచి, చేయి నోటివద్ద కెత్తఁబోయి వడకించుచు క్రిందఁ బడవైచెను. అప్పడు రాజశేఖరుఁడుగారు వెంటనేపోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొనిపోవుచున్న పెదవులను దడిపి నోటిలోఁ గొంచెము నీళ్ళు పోయఁగా గొంతసేపటి కాతఁడు మెల్లఁగా చప్పరింప నారంభించెను. అంతట రాజశేఖరుడుగారు తనచేతిలోని యుదకముతో మొగమును దడిపి మఱికొంచెము నీరు లోపలికిఁ బోయఁగా త్రాగి కన్నులు విప్పి