పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొమ్మను జేరి కోయిల యొక్కటి మధురమైన కంఠధ్వనితోఁ జెవుల పండుపు సేయుచున్నది.

రుక్మి__నాన్నగారూ! రామచిలుక కొమ్మమీఁద తలక్రిందుగా నిలుచుండి జామపండు నేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తిను చున్నదో చూడండి.

సీత __అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా?

సుబ్ర__అమ్మాయీ! చెట్టు క్రింద చిలుక కొట్టిన దోరకాయ లున్నవి తెచ్చుకో.

సీత పరుగెత్తుకొనిపోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొఱికి చూచి పంచదార వలె నున్నవని చంకలుకొట్టుకొనుచున్నది.

మాణి__ఎక్కడనుండియో యిప్పడు గుప్పున మల్లెపువ్వుల వాసన కొట్టినది

సుబ్ర__అమ్మా! వేగిరమురా. అదిగో పొగడచెట్టు మీఁద నొక యడవిమల్లెతీగ అల్లుకొని, గంపలకొలఁది తెల్లని పుష్పము లతో నిండియున్నది. మన యింటికడ నెన్ని నీళ్ళు పోసినను, మల్లె పువ్వు లీలాగున పూయవుగదా!

మాణి__ ఆహా: పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి

సుబ్ర__ఇప్పడు పది గడియల ప్రొద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నఁడైన వేసవికాలములో గాలి యింత చల్లగా నున్నదా?

రాజ__సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గ స్థుల సంతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుక జాయమానకటాక్షముచేత స్వేచ్ఛముగా ననుభవింప ప్రసాదించిన యీశ్వరుని మహత్త్వము నెఱిగి కొనియాడ మన మెంతవారము? మనమెన్నడును నిల్లు కదలక పోవుటచేత నిటువంటి సౌఖ్యముల నేమియు నెఱుఁగనివారమై యుండియ, మనమే యెల్లవారికంటెను మిక్కిలి సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపుర ముండి, దీనబంధువైన పరమాత్ముని యను