పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు తప్ప మఱియెవ్వరును స్త్రీలు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్య యంతయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలలోఁ బడవేసికొని పట్టణము పాడు చేయుటకొఱకే పనికి వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్మార్గప్రవర్తనమునకును లేశమయినను తోడుపడుచుండ లేదు.

అక్కడ సప్తమివఱకునుండి రాజశేఖరుఁడుగారు కాశీకి వెళ్ళుటకు ప్రయాణమయిరిగాని, సంవత్సరాదివఱకు నుండుఁ డని రామమూర్తిగారు బలవంత పెట్టినందున నాతని మాట తీసివేయలేక యొప్పుకొనిరి. ఫాల్గుణ బహుళ అమావాస్యనాఁడు పగలు మూడు జాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టెను.జను లందఱును గోదావరిలో పట్టుస్నానము చేసి తమపితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందఱు పుణ్యము కొఱకు నవగ్రహ జపములు చేయుచు బ్రాహ్మణులకు నవధాన్యములను దానము చేయుచుండిరి; కొందఱు ఛాందసులను వృద్ధాంగనలను సూర్యునకు విపత్తువచ్చె నని కన్నుల నీరు పెట్టుకొనసాగిరి; వారిలో దెలిసినవార మనుకొను వారు సూర్యునకుఁ బట్టిన పీడను వదలగొట్టుటకయి మంత్రములను జపించుచుండి; వారికంటెను దెలివిగలవారు గ్రహణ కాలమునందు తమ కడుపులలో జీర్ణముగాని పదార్థము లుండిన దోషమని యెఱిగి దాని ముందు మూడుజాముల నుండియు నుపవాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపదార్థము లుండు పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కడుపుతో నున్న స్త్రీలు పైకి వచ్చినయెడల అంగహీను లయిన పిల్లలు పుట్టుదురని యెంచి పెద్దవా రట్టి స్త్రీలను గదులలో బెట్టి తాళమువేసి కదలమెదలవదని యాజ్ఞాపించిరి; మఱి కొందఱు మంత్రవేత్తలమని పేరుపెట్టుకొన్నవారి కేమయిన నిచ్చి మంత్రోప దేశమును బొంది శీఘ్రముగా సిద్ధించుటకయి ఱొమ్ముల బంటి నీటిలో జపము చేయుచుండిరి, గ్రహణకాలమున నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందఱు మూఢులు స్నానముచేసి దిసమొలలతో