పుట:Raajasthaana-Kathaavali.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా సంగుఁడు.

87


అతఁ డదివఱకు మద్యపానము విశేషముగాఁ జేసెడు వాడుక కలదు. అది పాపమనియు నాకారణంబున భగవంతునకుఁ దనపై నాగ్రహంబు వొడముననియుఁ దెలిసికొని యతఁ డాదినము మొదలు సారాయములను దాగనని గొప్పయొట్టు పెట్టుకొని యంత కాలమును సారాత్రాఁగెడు వెండి బంగారుగిన్నెలు పళ్ళెములు ముక్కముక్కలుగా బగులఁ గొట్టి యాముక్కలను పకీరులకు బీదలకు పంచి పెట్టెను. అంతలో తనివిసనక యతడు గూనలతో నున్న సారా నంతయు నేలం బారఁబోయించి యాదినమున దనకు జయము లభించిన పక్షమున మహమ్మదీయులవద్దనుండి తాను' గృహించుచున్న దస్తావేజుపన్ను కొట్టి వేయుదునని ప్రమాణము చేసెను. మాటలతో బోవక కార్యముఁ జేసి చూపిన తను చక్రవతి౯ యొక్క మాగ౯ము ననుసరించి సేనాపతులు సామంతులు ఉమ్మరావులు అమీరులు మొదలగువారు మున్నూరుమంది యొక్క దినము లోపుగ త్రాఁగమని శపథము చేసి త్రాగుబోతుతనమును మాని పవిత్రులయిరి. ఇట్లు జరిగిన పిదప బేబరు విచారగ్రస్థుడయిన సైనికులను సేనాపతులను బిలిచి వారికి మతావేశము గలిగించి కయ్యమునకుఁ బురికొల్పవలయునని తలంచి యిట్లని విజ్ఞాపనము చేసెను.

ఓవీరులారా ! ఈ ప్రపంచమునఁ బుట్టిన వాఁడు గిట్టక మానఁడు. ఎప్పుడో యొకప్పు డీలోకమును విడువక తప్పదు. బ్రతికియుండి పరాభవములు పొందుటకంటె చచ్చి గౌరవమందుట మేలు నేను చచ్చినను సరే మంచి పేరుతో చనిపోయితినా చాలును. భగవంతుఁడు దయామయుఁడు. మన మిందు గడతేరితిమా మతముకోఱకు మృతినొందిన శూరులమగుదుము. గెలిచితిమా దేవుని మెప్పించినవార మగుదుము. కాబట్టి మనముమరణమునకు జంకమనియు యుద్ధ భూమినుండి 'వెనుకంజ యిడమనియు నొకమారు ప్రమాణములు చేయుదము.”