పుట:Raajasthaana-Kathaavali.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

రాజస్థానకధావళి.


నుండి యుద్ధము చేయు వారికి తప్పక యవజయము కలుగు నని వారు నొక్కి పలికిరి.

ఆ రెండువారములలోను రాణాకును ఢిల్లీ చక్రవతి౯కిని సంధి మాటలు జరిగినవని రాజపుత్ర చరిత్రకారులు కొందఱు వ్రాసిరి. బేబరు తాను విదేశములలో పంచాగ్ని మధ్యమువంటి శత్రు మండల మధ్యమున నొంటిగ నుండుట యెఱుంగును. ఈ యుద్ధములో తన కపజయము సంభవించెనా పగతురు నలుపురు నాలుగుమూలలనుండి వచ్చి తన్ను చుట్టుకొందురనియు నప్పుడు తాను కష్టపడి సంపాదించిన ఢిల్లీ రాజ్యము చేయి దాఁటిపోవుటయేగాక స్వస్థానమైన కాబూలునైన చేరుట సంభవింప దనియుఁ గూడ నతఁ డెఱుఁగును. రాణాసంగుఁడు చాకచక్యము గలవాఁడు వివేకియునై మివారు రాజ్యమునిమిత్తము స్వసౌఖ్యమును గణియింపక పాటుపడుచున్న వాఁడని యతఁడు విని యుండెను. అందుచే రాజపుత్ర చరిత్ర కారులు చెప్పినట్లుభయులు సంధి ప్రయత్నములు చేసి యుందురనియే మనము నమ్మవచ్చును. ఆయొడంబడికలో బేబరు కోరిన పద్ధతు లన్నియు రాణా కవమానకరములు గానివియు నతఁడు తప్పక యంగీకరింపదగినవియునై యుండెను.

పద్ధతులివి 1. పసుపునీటి యేరు మీవారు రాజ్యమున కుత్తరపు టెల్లగా నుండవలయును. 2. 'బేబరు ఢిల్లీ రాజ్యము నాక్రమించినందుకు రాణా వారి కేఁటేఁట కొంతకప్పము నిచ్చుచుండ వలయును. కాని, యిట్లు సంధినిగురించి మాటలు జరుగుచుండ సంగుఁడు బేబరు వద్దకుఁ బంపిన రాయబారి తురకలవద్ద లంచము గ్రహించి నీచుఁడై తనయజమానుని గుట్టు బయలు పెట్టెనని రాజపుత్రులలో నొక వాడుక కలదు. ఆరాజద్రోహి తారావంశస్థుఁ డగు శిలా దేవుఁ డనువాఁడు. బేబరు పలుమారు తాను జేసిన తప్పులను గూర్చి నిజమయిన పశ్చాత్తాపమును బడుచు వచ్చెను. దాని కుదాహరణముగ నొక చిన్నకథ గలదు.