పుట:Raajasthaana-Kathaavali.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశ రాజకుమార చరిత్ర,

179


రాజానుగ్రహపాత్రుఁడు. రాత్రులు మంచు గురిసెనా వెంటనే బలుఁడు చెట్లు నరికి రాణా కొఱకు నెగళ్లు వేయును. సేనలు తురకలతో దలపడెనా పగతురం బారఁదోలుటలో మొదటివాఁడయి యాబలుఁడే యొడ లెఱుంగక యుద్ధము సేయును. అట్లోడలు దాఁచుకొనక పని సేయు నాషోడశ రాజకుమారులమీఁద నింతిత యనరాని యనుగ్రహము గల్గి సంతోషపరవశుఁ డయి రాణా యొకనాఁడు తన సేన లిఁక ముందు యుద్ధమునకుఁ బోవునపుడెల్ల యీసూక్తవతులే సేనలను నడపవలసిన దని శాసించెను. ఇది రాజపుత్రులకు రాణా చేసెడి గౌరవ ములలో మిక్కిలి గొప్పది. చిరకాలము నుండి యీగౌరవము చందావతువంశస్థులకుఁ జెల్లుచుండెను. వెనుక చండుండు చిత్తూరునుండి పగతురఁ బారఁదోలుట చే రాణా యావంశస్థుల కాగౌరవము జూపెను,ఉమ్రా సూక్తవతుల కీగౌరవ మిచ్చునపుకు తనమాట చెప్పుకొను టకు చందావతువంశజుఁడగు సలుంబ్రా యచ్చట లేక పోయెను. తక్కినవారు రాణాకు జంకి యెదు రాడజాల రయిరి.

మఱునాడు తురకలతో యుద్ధముతెలియుటచే నారాత్రి కొంచెము నిద్రబోవలయు నని సలుంబ్రా తనగుడారమున నుండెను. కాని యతనికి నిద్రపట్టకుండ వానిబిరుదుల కీర్తనము సేయు భట్టు వాడు పలుమా రట్టిటు తిరుగుచు వానిబిరుదనామములు గట్టిగ కేకలు వేయుచుఁ జదువ నారంభించెను.

ఆ కేకలు వినివిని సలుంబ్రా విసిగి యోరీ ! యేలరా యిట్లరచెదవు. నన్ను నిద్రపోనిమ్ము. శత్రువులు దాపున లేరుగదా యిప్పుడు మన బిరుదులు చదువ నవసర మేమున్న”దని మందలించెను. ఆపలుకులు విని యాబట్టువాడు స్వామీ ! మీబిరుదులు నేను కైవారము సేయుట కిదియే కడపటి సారి. ఇఁకముందు ప్రాయశః మీబిరుదులుచ్చరింప నవసర ముండదు. సేనను నడపించు నధికారముతో పాటు మీబిరుదులును రేపు సూక్తవతులకే యీయఁబడు" నని యుత్తరము చెప్పెను.