పుట:Raajasthaana-Kathaavali.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

--:0:--

హళ్డిఘాటు యుద్ధమునందు రాణా ప్రతాపసింగు సంపూర్ణముగ నోడింపఁబడినాఁడను నమ్మకము చేతను, యుద్ధ యాత్రలు చేయుట కనర్హమైన వర్షకాలము వెంటనే ప్రాపించుట చేతను జహంగీరు చక్రవతి౯ తాను గెలిచిన గెలుపు సఫల మగునట్లు రాజపుత్రుల నడుగంట దొక్కక విడిచి తన సేనలను ఢిల్లీ నగరమునకుఁ దీసికొనిపోయెను. అందుచేత 'స్వేచ్ఛగా నూపిరి విడుచుకొనుటకు నలుదెసలకుం జెదిరి పోయిన తసమూకల మరలఁ జేర్చికొనుటకుఁ బ్రతాపునకు వీలుదొరకెను. మరుచటిసంవత్సరము దండ యాత్రలు సేయుట కనుకూలమగు వసంత కాలమున జహాంగీరు తన విజయమును సంపూర్ణము సేయుటకు మరల రాజస్థానము పై దండువిడిసెను. అప్పుడు ప్రతాపుఁడు రణ రంగమున మొగలాయి సేనలం దాఁకి దారుణ యుద్ధము చేసెను, కాని దైవయోగమున రాజపుత్రులు పూర్ణముగఁ బరాజయమునొందిరి. అందుచేత మున్ను పృథివిరాజే కోటలోనుండి శత్రువులఁ దృణప్రాయముగఁ జూడఁగలిగెనో యా కమల్మీయరుకోటకుఁ బోయిన, తాను సురక్షితముగ నుండవచ్చునని ప్రతాపసింగు సపరివారముగ నక్కడికిం జనియె.

ఎచ్చటికిఁబోయిన నాపదలు వెంట వచ్చునన్నట్లు ప్రతాపునకు నక్కడఁగూడ దన కపాయము సేయ నెంచిన మహాద్రోహి యొకఁ డుండెను. వెనుక పృథివి రాజునకు విసము పెట్టిన 'దేవరకోట రాజువంశస్థులలో నొకఁడు ప్రతాపుని పక్షమున నున్నట్లే యుండి కోటలోని సైనికులు త్రావు నీటిలో విసము గలిపించెను. అది కారణముగ ప్రతాపునినిమి త్తము రాజపుత్ర మహావీరులు ప్రాణములు విడువ వలసి వచ్చెను. ఆవీరులు చాటుచాటున దమ రాణాను గోడ దాఁటించి