పుట:Punitha Matha.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధనుగూడ గుర్తించాలి. క్రైస్తవమతం 16వశతాబ్దంలో లూథరు తిరుగుబాటుతోనే పుట్టలేదు. ఆ మతానికి అంతకుముందే పదహారు వందల యేండ్ల జీవిత చరిత్రవుంది. ఆ పదహారు వందల యేండ్లలో క్రైస్తవ ప్రజలు మరియుమాతను ఎలా పూజించారో ఎందుకు పూజించారో అర్థంచేసికోవాలి. బైబులు మరియమాతను గూర్చి అన్ని విషయాలూ చెప్పదు. అసలు దాన్ని వ్రాసినప్పటి పరిస్థితులు వేరు. కాని బైబులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి చూచినట్లయితే నేడు క్యాథలిక్ సమాజం మరియమాతను గూర్చి విశ్వసించే విషయాలు అంత అసందర్భంగా దోపవు. ఉదాహరణకు, నూత్న వేదమెక్కడా కూడా మరియ నిష్కళంకోద్బవి అని చెప్పదు. ఐనా క్యాథలిక్ శ్రీసభ అలా నమ్ముతుంది. ఈ నమ్మికకు ఆధారం లూకా 1,28 వాక్యం లోని "దైవానుగ్రహ పరిపూర్ణురాలు" అనే మాటలో లేక పోలేదు. ఈలాగే మిగతా విషయాలు కూడాను.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతను కొనియాడేపుడు ఎందుకు అలా కొనియాడుతున్నారో ప్రొటస్టెంటులకు వివరించి చెప్పగలిగి వుండాలి. ఈ విషయంలో ప్రొటస్టెంటులు ప్రశ్నించినా క్యాథలిక్కులు తరచుగా తృప్తికరమైన జవాబు ఈయలేకపోతున్నారు. అంచేత వాళ్ల సందేహంఇంకా బలపడుతూంటుంది. పైగా క్యాథలిక్కులు కొంతమంది క్రీస్తును మరియమాతను కలిపివేస్తుంటారు. క్రీస్తును ఆరాధించినా మరియును పూజించినా ఒకటే అనుకుంటూంటారు. ఇంకా కొంతమంది అజ్ఞానం వల్ల క్రీస్తును విస్మరించి మరియను మాత్రమే పూజిస్తుంటారు. ఈలా చేయడం తప్ప, క్రీస్తువేరు, మరియు వేరు.