పుట:Punitha Matha.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లిద్దరూ చేసిన కృషి కూడ వేరువేరు. మనలను రక్షించింది క్రీస్తు ఆ క్రీస్తుని బట్టి మరియమాత వచ్చింది. అంతేగాని, మరియమాతను బట్టి క్రీస్తురాలేదు. కనుక మనం మొదట రక్షకుడైన క్రీస్తును ఆరాధించి ఆ పిమ్మట మరియమాతనుగూడ గౌరవించాలి. ఇది ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం. మరియమాతనేమో గౌరవించవలసిందే. కాని క్రీస్తునిబట్టి మాత్రమే. “ఇకమీదట సకల తరాలవాళ్లు నన్ను ధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు" అన్న మరియ వాక్యం గూడ యిదే. వాటికన్సభ దృక్పథం వలననైతేనేమి, ప్రపంచమందలి వివిధ క్రైస్తవ శాఖల నాయకుల కృషివలన నైతేనేమి మరియమాత వివిధ క్రైస్తవ సంప్రదాయాల వాళ్లను ఐక్యపరుస్తుందని విశ్వసిద్దాం.

2. హైందవ సంప్రదాయం

ఈ దేశంలో చాలమంది హిందువులు కన్యమరియను గౌరవి స్తుంటారు. మన ప్రాంతంలోనే చూచినట్లయితే గుణదలలో జరిగే లూరుమాత తిరునాళ్లలో చాలమంది హిందువులు పాల్గొని కానుకలు అర్పిస్తుంటారు. మరియమాత ప్రతిమనో, చిత్రాన్నో ఇండ్లల్లో వుంచుకొని ఆమెను గౌరవించే హిందూ కుటుంబాలు కూడ కొన్ని ఈ రచయితకు తెలుసు. ఇక హిందూమతంలో మరియులోలాగ కన్యత్వమూ మాతృత్వమూ ఒకే వ్యక్తియందు కన్పించే దేవత ఎవరూ లేరు. కాని తల్లిగానో కన్యగానో పరిగణింపబడే దేవతామూర్తులు మాత్రం చాలమంది వున్నారు. ఈ "కన్యలు" ఈ “అంబలు” మరియమూతను సూచిస్తుంటారు. వీళ్లందరికీ ఆమె ప్రాతిపదికగా వుంటుంది. మరియ క్రైస్తవ ప్రజనే గాదు, సర్వ మాస్తత్తాళిని క్రీస్తుతో జోడిస్తుంది అన్నాం.