పుట:Punitha Matha.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన అయోగ్యతను ఆమె యోగ్యత పూరిస్తుంది. మన అశక్తతను ఆమె శక్తి సవరిస్తుంది. కనుక మన అక్కరలన్నీ ఆ తల్లి ద్వారా దేవునికి విన్నవించుకోవాలి.

వేదశాస్త్రజ్ఞలు మరియమాత మనకు ఎలా వరస్రసాదాలు ఆర్జించి పెడుతుంది అని ప్రశ్నించుకొని చాల ఉపమానాలు చెప్పారు. 12వ శతాబ్దపు భక్తుడు క్లేర్వో బెర్నార్డు ఆమెను ఓ కాలువతో పోల్చాడు. దూర ప్రాంతంలోని చెరువు లేక ఆనకట్టయందలి నీళ్లు కాలువద్వారా మనవూరి పొలం దాకా వస్తాయి. క్రీస్తు ఓ వరప్రసాదాల చెరువు. ఆ చెరువునుండి వరప్రసాదాలనే జలాలు మరియమాత అనే కాలవ ద్వారా మన హృదయంలోకి ప్రవహిస్తాయి.

ఇంకా కొందరు మరియను ఓ నిచ్చెనతో ఉపమించారు. నిచ్చెన గుండా యింటిమీదికో, చెట్టుమీదికో ఎక్కిపోతాం. క్రిందికి దిగివస్తాం. మరియమాత అనే నిచ్చెన గుండా దేవుడు మనమంటి మీదికి దిగివచ్చాడు. మరియ అనే నిచ్చెనను వాడుకొని మనం మోక్షానికి ఎక్కిపోతాం. ఆమె ద్వారా క్రీస్తు దగ్గరకు వెళ్తాం. అనగా మరియు తన వరప్రసాదాల ద్వారా మనలను క్రీస్తుచెంతకు చేరుస్తుంది.

వేరుకొందరు ఆ తల్లి చంద్రబింబం లాంటి దన్నారు. చందమామ సూర్యుని వద్ద నుండి వెలుగును పొందుతుంది. తాను వెలుగుతుంది. ఆ వెలుగునే వెన్నెల రూపంలో భూమికి అందిస్తుంది. అలాగే మరియ కూడ క్రీస్తు దగ్గరనుండి వరప్రసాదం పొందుతుంది. తాను ధన్యురాలౌతుంది. ఆ వరప్రసాదాన్ని మనకూ అందించి మనలను కూడ ధన్యులను చేస్తుంది. కనుక సూర్యునికీ భూమికీ మధ్య చంద్రబింబం ఎలాగో, క్రీస్తుకు నరులకూ మధ్య మరియు అలాగు.