పుట:Punitha Matha.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన చిత్తం చొప్పున, తనకిష్టం వచ్చిన వాళ్లకి, తనకు తోచిన రీతిగా పంచి పెడుతూంటుంది" అని వ్రాశాడు. మరియ వరప్రసాదాల మాత. ఇక్కడ ఈ విషయాన్ని గూర్చి మూడంశాలు చర్చిద్దాం.

1. వరప్రసాదాల మాత అంటే ఏమిటి?

ప్రస్తుతం మనం పొందే వరప్రసాదాలేవైనా సరే మరియమాత ద్వారా గాని లభింపవు. క్రీస్తు ద్వారా గాని పిత దగ్గరకు వెళ్లలేం. అలాగే మరియు ద్వారా గాని క్రీస్తు దగ్గరకు వెళ్లలేం. క్రీస్తు మనకోసం పితను మనవి చేసినట్లే, ఆ తల్లి మనకోసం క్రీస్తును మనవిచేస్తుంది. ఈ భూమి మీద చరిస్తున్నపుడు ఆ తల్లి ఎలిసబేతును సందర్శించి స్నాపక యోహానుకు మేలుజేసింది -లూకా 1,41. కానావూరిలో పెండ్లివాళ్ల అక్కర తీర్చింది –యోహా 2,3. కల్వరి కొండ మీద యేసుశిష్యులకు తాను తల్లిగా నిలిచింది -యోహా 19,2. యెరూషలేము మీదిగదిలోవుండి శిష్యులు ఆత్మను పొందాలని ప్రార్ధించింది -లూకా 1,14. ఈలా ఈ లోకంలో జీవించి నపుడు క్రీస్తు శిష్యులను ఆదరిస్తూ వచ్చిన తల్లి నేడు మోక్షంలో వుండి మాత్రం మనలను మరచిపోతుందా? పోదు. మనకోసం మనవి చేస్తుంది. వరప్రసాదాలను ఆర్జించి పెడుతుంది.

2. మరియ యెందుకు వరప్రసాదాల మాత?

మరియమాత ఏలా వరప్రసాదాల మూత ఐంది? ఆమె మన రక్షణంలో తోడ్పడిందన్నాం. రక్షణం ద్వారా క్రీస్తు మన పాపాలను పరిహరించి వరప్రసాదాలను ఆర్జించి పెట్టాడు. ఇక రక్షణ ఫలితమైన వరప్రసాదాలను ఆర్జించడంలో క్రీస్తుకు తోడ్పడిన మరియు, ఆ