పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లు. ఇంకా రాతిగుడి లేదు. బాలుడైన సమూవేలు దేవళంలో ఏలీకి సహాయం చేస్తుండేవాడు. ఒకరోజు రాత్రి సమూవేలు దేవాలయం గర్భాగారంలో మందసంవద్ద పండుకొని నిద్రపోతున్నాడు. అక్కడ వెలిగే దీపంలో చమురు పోయడం అతని పని. ఏలీ దేవళం మధ్యభాగంలో పండుకొని నిద్రిస్తున్నాడు. అపరాత్రిలో దేవుడు బాలుణ్ణి పిల్చాడు. అతడు ఏలీ దగ్గరికి వచ్చి నీవు నన్ను పిల్చావు గదా, ఇదిగో వచ్చాను అన్నాడు. ఏలీ నేను నిన్ను పిలువలేదు, వెళ్లి పండుకో అని చెప్పాడు. ఈలా మూడుసార్లు జరిగింది. మూడవసారి దేవుడే బాలుణ్ణి పిలుస్తున్నాడని ఏలీ గ్రహించాడు. అతడు నీవు ప్రభువు పలుకులు విని వాటిని నాకు తెలియజేయమని బాలునితో చెప్పాడు. నాల్గవసారి ప్రభువు సమూవేలుని పిల్చి సందేశం విన్పించాడు. ఏలీ కుమారులు దేవళంలో పాపాకార్యాలు చేసి దేవునికి అపకీర్తి తెస్తున్నారు. కనుక దేవుడు అతని కుటుంబాన్ని నాశం జేస్తానని తెలియ జేశాడు. ఆ సందేశాన్ని బాలుడు ఏలీకి విన్పించాడు. తర్వాత ఫిలిస్టీయులతో జరిగిన యుద్ధంలో ఏలీ కుటుంబం నశించింది. అతనికి బదులుగా సమూవేలు షిలో దేవాలయంలో యాజకుడయ్యాడు. పై దర్శనంలోనే అతడు ప్రవక్త ఐపోయాడు. తాను ప్రభువు పలుకులు ఆలించి వాటిని ప్రజలకు తెలియజేస్తుండేవాడు. అతడు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి, యుద్ధవీరుడు. ఆ రోజుల్లో ఫిలిస్టీయులు యిప్రాయేలుకు ప్రబల శత్రువులు. కనుక సమూవేలు ప్రజలను వారిమీదికి యుద్ధానికి తీసికొని పోతుండేవాడు. అతడు నలభైయేండ్ల పాటు జనానికి నాయకుడుగా మెలిగి వారిని దైవమార్గాల్లో నడిపించిన భక్తుడు.

47. దేవుడు సౌలు రాజుని నిరాకరించడం -1సమూ 13, 15

యావే ఆజ్ఞప్రకారం సమూవేలు సౌలుకి మొదటి రాజుగా అభిషేకం చేశాడు. ఆ రాజు మొదట బాగానే పరిపాలించాడు గాని రానురాను దేవుని ఆజ్ఞలు మీరుతూ వచ్చాడు. అతడు మిక్మాసువద్ద ఫిలిస్టీయులతో యుద్ధం జేస్తున్నాడు. సమూవేలు నేను ఏడు రోజుల్లో వచ్చి దహనబలి సమర్పించి దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పాడు. కాని అతడు గడువు ప్రకారం రాలేదు.