పుట:Prasarapramukulu022372mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ప్రసార ప్రముఖులు.


ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1966 నుండి విదేశాలలో సంగీతసభలు దిగ్విజయంగా జరిపారు. 1943లో ఆయనకు 13వ ఏట ఆంధ్ర సారస్వత పరిషత్ గాన సుధాకర బిరుదు నిచ్చినది. 1971లో భారత ప్రభుత్వం పద్మశ్రీ యిచ్చింది. ఆ తర్వాత పద్మభూషణ బిరుదంతో సత్కరించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ పట్ట సత్కారం చేశాయి, తెలుగు విశ్వవిద్యాలయానికి 1993లో ప్రో ఛాన్సలర్ గా వ్యవహరించారు. అకాడమీల రద్దుకు నిరసనగా బాలమురళి సంగీత కచేరీలు ఆంధ్రదేశంలో కొంతకాలం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కచేరీలు మొదలెట్టారు.

'సంగీత' కంపెనీవారికి నూరు క్యాసెట్లు రికార్డుచేసి ఒక రికార్డు సృష్టించారు. సినిమాలలో అనేక పాత్రలు ధరించారు. అనేక చిత్రాలకు నేపథ్య సంగీతము, సంగీత దర్శకత్వమూ నిర్వహించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకు పనిచేశారు. రేడియో, టెలివిజన్ వారికోసం బెంగాలీలో రవీంద్ర సంగీతం పాడి రికార్డు చేశారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదపాత్ర ప్రముఖం.

గాయకశిఖామణి, వాగ్గేయకార వాచస్పతి, సంగీత మహోపాధ్యాయ, సంగీత సార్వభౌమ, సంగీత భూపతి, గాన సుధాకర, నాద సుధార్ణవ వంటి బిరుదులెన్నో వారి నలంకరించాయి. మదరాసులోని సంగీత అకాడమీ 1979లో 'సంగీత కళానిధి' బిరుదు ప్రధానం చేసింది. విజయవాడ పురపాలక సంఘం పౌర సన్మానంచేసి వీరి పేర ఒక వీధికి నామకరణం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఆస్థాన విద్వాంసులు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్సు, రష్యా, మలేషియా, శ్రీలంక, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలు విరివిగా పర్యటించి కచేరీలు యిచ్చారు. ఎన్నో కొత్త రాగాలకు సృష్టికర్త అయ్యారు. 400 కృతులు రచించారు. మేళకర్త రాగాలు సృష్టించారు. సంగీతం ద్వారా రోగ నివారనికి కృషిచేస్తున్న బాలమురళి బహుముఖ ప్రజ్ఞాశాలి.