పుట:Prasarapramukulu022372mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

ప్రసార ప్రముఖులు.

విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో సత్కరించింది. ఆగ్రా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ నిచ్చింది.

అమృతాభిషేకం, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, మహాబోధి, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు కవితా సంపుటాలు. గాలిబ్ గీతాలు అనువాద గ్రంథం. తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 5-11-87న దాశరథి పరమపదించారు.

వీరి సోదరులు దాశరథి రంగాచార్య మంచి నవలా రచయిత. మునిసిపల్ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు.

దాశరథి రుబాయిలను, గజళ్ళను వ్రాయడంలో అందెవేసిన చేయి. ఆయన మంచి సాహిత్య విమర్శకుడు. సాహిత్య సభలు, కవిసమ్మేళనాలు ఆయన అధ్యక్షత వహించిన తీరు ఎంతోవిలక్షణం. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు పద్యం వ్రాసినా వచన కవిత్వం వ్రాసినా, గేయం వ్రాసినా అందచందాలు చూపగలిగేవాడు. దాశరథి సింహగర్జనకవితోద్యమమై తెలంగాణా అంతటా ఆవరించింది. అభినవ దాశరథీ శతకంలో ఆయన సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. జయదేవుని గీతా గోవిందానికి భావవ్యాఖ్యనం చేశారు. ప్రతిభాపూర్వకమైన ఉపోద్ఘాతం వ్రాశారు. వ్యాసపీఠం పేరుతో ఆయన సాహిత్యవ్యాస సంపుటి ప్రచురించారు. అందుకే కవితాశరధి దాశరథి

డా. రావూరి భరద్వాజ :

కథా రచయిత, నవలా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భరద్వాజ గుంటూరుజిల్లాలో జన్మించారు. నాలుగోతరగతి మించి చదువుకోలేదు. ఆకాశవాణిలో చేరడానికి ముందు పేనాలు అమ్మడం మొదలు పత్రికలలో పనిచేయడం వంటి సాదాసీదా పనులు చేశారు. ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రంలో Script writerగా చేరారు.

1975 తెలుగు ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా హైదరాబాదులో చేరారు. 1984లో రిటైరయ్యేంత వరకు ఆయన ప్రసంగశాఖను సమర్థవంతంగా నిర్వహించారు.

పాకుడురాళ్ళు నవల ద్వారా భరద్వాజ లోకానికి సుపరిచితులు. అనేక నవలలు, కథలు, వ్యాసాలు, బాలసాహిత్యం భరద్వాజ కలంనుండి వెలువడ్డాయి.