పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ప్రపంచ చరిత్ర

వేసిరి. ఉత్తరమునుండివచ్చిన అమాయకులును, పూర్తిగా నాగరికులు కానివారును అయిన రాయబారులీ కర్మకాండము చూచి ఎంతో మెచ్చుకొనిరి. ఇస్లాములో ఇట్టి వైభవమేమియులేదు. కాన వారు క్రైస్తవమే బాగున్నదని భావించి ఇంటికి తిరిగివచ్చిరి. తాముచూచిన విషయములు రాజుకు నివేదించిరి. అటుపిమ్మట రాజును ప్రజలును క్రైస్తవమతమును స్వీకరించిరి. వారు క్రైస్తవమును కాంస్టాంటినోపులునుండి గ్రహించిరి గనుక, ఆర్తోడాక్సు గ్రీకుచర్చినే అనుసరించిరికాని రోము ననుసరించలేదు. తరువాతకాలమునందైసను రష్యా యెన్నడును రోములోని పోపును అంగీకరించలేదు.

రష్యా మతాంతరప్రవేశము క్రైస్తవమత దండయాత్రలకు పూర్వమే జరిగెను. బల్గేరియనులుకూడ ఒకకాలమున మహమ్మదీయులు కావడానికి ఆర్ధాంగీకారము చూపిరట. కాని కాంస్టాంటినోపులు ఆకర్షణ బలీయముగా ఉండెను. వారి రాజొక బైజాంటైను రాజ కుమార్తెను వివాహమాడి క్రైస్తవుడాయెను. బైజాంటియమ్ కాంస్టాంటినోపులు పాత పేరని నీకు జ్ఞాపకముస్నదా? ఈవిధముగానే పొరుగున నున్న జాతులుకూడ క్రైస్తవము నవలంబించెను.

ఈ మత యుద్ధములు జరుగుకాలమున యూరోపులో యేమి జరుగుచుండెను? కొందరు రాజులును చక్రవర్తులును పాలస్తీనాకు బ్రయాణమై వెళ్ళిరనియు, అందు పలువురు అచ్చటి కష్టములపాలై రనియు తెలసికొనియుంటిమి. ఈకాలమున పోపు రోములో కూర్చుండి నమ్మకములేని తురుషునిపై పవిత్రయుద్ధము సాగించమని వుత్తరువులూ, హెచ్చరికలూ చేయుచుండెను. బహుశా ఈకాలమునందే పోపులప్రాబల్యము మిన్ను ముట్టుచుండెను. కనోస్సావద్ద అభిమానియగు చక్రవర్తి యొకడు పాదరక్షలులేకుండ మంచులోనడచి క్షమాపణ వేడుకొనుటకు పోపు దర్శనమునకై నిరీక్షించెనని యిదివరలో చెప్పియుంటిని. ఇతడు