పుట:Pranayamamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుము. ఇది చాలును. ఏలనన, అన్ని విషయములు కలిగి యుండి ఆదర్శవంతముగ నుండుచోటు లభించుట కష్టకరము.

నర్మద, యమున, గంగ, కావేరి, గోదావరి, కృష్ణా నదీతీరములు యీ రీతిగ కుటీరములను వేసికొనుటకు చాల అనుకూలముగ వుండును. ఏదైన అట్టి స్థలమును ఒక దానిని చూచుకొనుము. చుట్టుప్రక్కల ఎవరైన సాధకులు వున్నచోటును నిర్ణయించుకొనుట అవసరము. ఎందుకన, ఏవైన సంశయములు, చిక్కులు కలిగినప్పుడు వారు తీర్చెదరు. యోగక్రియలలో దృడమైన నమ్మకమును కలిగి యుండవలెను. నాసిక, హృషీకేశము, ఝూంసీ, ప్రయాగ, ఉత్తరకాశీ, బృందావనము, అయోధ్య, కాశీ మొదలగునవి చక్కని ప్రదేశములు. జన సమూహమునకు దూరముగ వుండెడి ఏదేని ఒక స్థలమును ఎంచుకొనుము. జన సమూహమునకు దగ్గర వున్నచో, ఏమిటో చూతమని జనులు ప్రోగగుటయు, అందువలన సాధనకు భంగము కలుగుటయు తటస్థించును. ఇందు వల్ల ఆధ్యాత్మికశక్తి కంపనములు లేకుండ పోవును. ఇక, మహారణ్య మధ్యమున ప్రారంభించదలచినచో, నీకు అక్కడ ఏవిధమగు రక్షణయు దొరకదు. దొంగలు, వనమృగములు నిన్ను బాధింతురు. ఆహార సమస్య వచ్చును. కావుననే, శ్వేతాశ్వతరో పనిషత్తులో, "చదునైనట్టిన్నీ, రాళ్ళు, నిప్పు, కంకర లేకుండులాగునను, చూచుటకు ఇంపుగా వుండులాగునను ఒక గుహను బాగుచేసికొని, గాలివల్ల ఏవిధమగ బాథ కలుగకుండులాగున ఏర్పాటు చేసికొని, ఆ పిమ్మట, తన మనస్సును దేవునివైపు మరల్చవలెను." అని చెప్పబడెను.

ఇంటియందు అభ్యాసముచేయువారు, తమ గదిని పరిశుభ్రముగను, నిశ్శబ్దముగను వుండునటుల చేయవలెను.