పుట:Pranayamamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశుద్ధరక్తము ప్రవహించును. ఈ రీతిని, దినమునకు 35 వేల పింటుల రక్తము పరిశుద్ధ పరుపబడునని లెక్కకట్టబడినది.

ఈ ధమునులనుండి పరిశుద్ధరక్తము సూక్ష్మకేశ నాళికలలోనికి పోవును. ఈ కేశనాళికలనుండి రక్తమునందలి శుభ్రధాతువు బయటకు పారి, శరీరమునందలి ధాతువులనన్నింటిని పరిశుభ్ర పరచును. ఈ ధాతువులు అచ్చట శ్వాసించును, ఆ శ్వాసించునప్పుడు, ప్రాణవాయువును గైకొని, బొగ్గుపులుసు గాలిని ధాతువులు బయటకు విడచును. ఈ విడువబడిన అపరిశుద్ధతలను సిరలు తీసికొనిపోవును.

ఈ విచిత్రమగు యంత్రమును నిర్మించిన వాడెవడు? దీనినంతను సృష్టించిన వాడెవడో ఒకడు గలడని యిప్పటికైన తెలిసికొంటివా? అతడే దేవుడు, ఆతని గొప్పతనమును ఈ మానవ యంత్రమే అడుగకుండ చెప్పుచుండుట లేదా? మన హృదయములలో దాగియున్న ఆ అంతర్యామి ఈ యంత్రముచేయుచున్న పనిని ద్రష్టగావుండి పరీక్షించుచుండును. అతడు లేనిదే, హృదయము రక్తమును ధమనులలోనికి తోడి పోయజాలదు. శ్వాసావయవములు రక్తమును పరిశుద్ధ పరుప జాలవు. తెలిసికొంటివా! ఇకనైన నీవు ఆతనిని ప్రార్థించుము, అతనిని స్మరించుము. ఆతనిని నీ యందలి ప్రతిఅణువునందు నిండియున్న వానినిగ అనుభవించి, సుఖించుము.

ఇడ, పింగళలు

వెన్నెముకకు రెండు వైపులను రెండు నాడీప్రవాహములు గలవు వీనిలో ఎడమవైపున గలదానిని 'ఇడ' యనియు కుడివైపున గలదానిని 'పింగళ' యనియు అందురు. వీటినే 'నాడులు' అందురు. కొందరు వీటిని అనుకంపిక మజ్జారజ్జువులు