పుట:Pranayamamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిని నాలుక యొక్క మూలము వద్దకు పీల్చి, బుద్ధిమంతుడైన వాడు అమృతమును పానముచేసి, జౌన్నత్యమును పొందును.

శ్వాసకోశములు

ఇచ్చట శ్వాసకోశములను గురించి వ్రాయుట అనవసరమని తలంచును. శ్వాసావయవములైన రెండు శ్వాసకోశములు (ఊపిరి తిత్తులునూ) రొమ్ముకు యిరుపార్శ్వముల నుండును. వీనితోపాటు, రెండు గాలి గొట్టములున్నూ వుండును. ఇవి రొమ్ము నందలి ఉపరితల హృదయ కుహరమునందుండును. ఇవి పెద్ద రక్తనాళము చేతను పెద్ద గాలి గొట్టము చేతను వేరు చేయబడు చున్నవి. ఈ శ్వాసకోశములు మెత్తగా సన్నటి రంధ్రములతో కూడి యుండి స్థితి స్థాపక ధాతువులు గలవై యుండును. వీటియందు అసంఖ్యాకములగు వాయుకోశము లుండును. ఈ వాయు కోశముల నిండ, వాయువు నిండి యుండును. మరణా నంతరము ఈ వాయు కోశములతో నిండియున్న శ్వాసావయవములను ఒక నీటి పళ్ళెములో పడ వేసినచో అది తేలును. ఇవి పలుచటి సన్నని పొరచే కప్పబడు యుండును. ఈ పొరను పుప్పుస వేష్టనము అందురు. ఈ పుప్పుస వేష్టనము ద్రవ ద్రవ్యముతో నిండి యుండి, శ్వాసావయములు గాలి పీల్చు నపుడు కలుగు రాపిడిచే చెడిపోకుండా కాపాడును. ఈ పుప్పుస వేష్టనముయొక్క ఒక పొర, శ్వాసావయవమును అంటుకొని యుండును. రెండవ చివరిపొర గుండె యొక్క లోపలి అంచును ఆనుకొని యుండును. గుండెను, శ్వాసావ యవములను రెంటిని ఒక దానితో ఒకటి, అంటి పెట్టుకొని యుండు లాగున చేయునది ఈ పొరయే.