పుట:Pranayamamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపనిషత్తులలో, ఈ ప్రాణము జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని వర్ణింపబడినది. మనస్సు, సంకల్పము లనునవి ఈ ప్రాణశక్తి వున్నప్పుడు మాత్రమే పనిచేయగలవు. లేనిచో చేయజాలవు. వినుట, చూచుట, మాట్లాడుట, యోచించుట, తెలిసికొనుట మొదలగునవన్నియు, ప్రాణశక్తి సహాయమువల్లనే జరుగును. అందువల్లనే వేదములు ప్రాణమును బ్రహ్మగా వాకొనుచున్నవి.

ప్రాణము ఎచట నుండును ?

ఈ ప్రాణము హృదయమం దుండును. అంత:కరణ మనునది ఒకటే అయినప్పటికి, అది నాల్గురూపములుగ నున్నది. 1. మనస్సు, 2. బుద్ధి, 3. చిత్తము, 4. అహంకారములని, చేయుపనుల ననుసరించి అంత:కరణ మీ రీతిని విభజింప బడినది. ఇదేరీతిని ప్రాణము ఒకటే అయినప్పటికి, అదిచేయు పనులననుసరించి ఐదురూపములను కలిగియున్నది. 1. ప్రాణము, 2. అపానము, 3. సమానము, 4. ఉదానము, 5. వ్యానము అని. దీనినే వృత్తి భేదమందురు. వీనిలో ప్రధాన ప్రాణమును ముఖ్యప్రాణ మందురు. ఈ ప్రాణము అహంకారముతో కలిసి హృదయమందు వసించును. ఈ పంచప్రాణములలో ప్రాణము, అపానములు ప్రధానమైనవి.

ప్రాణమునకు హృదయమువలె, అపానమునకు గుదము నివాసస్థానము. 'సమానము' నకు బొడ్డు, 'ఉదానము' నకు గొంతుకయు వాసస్థానములు. 'వ్యానము' శరీరమంతటను సంచరించుచుండును.

ఉపప్రాణములు - వాటి కృత్యములు

నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము - అను ఐదు ఉపప్రాణములు గలవు.