పుట:Pranayamamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణముయొక్క పని శ్వాసించుట. అపానము విసర్జన, సమానము జీర్ణముచేయుట, ఉదానము మ్రింగుటలను చేయును. ఇది జీవుని నిద్రింపజేయుట, మరణ సమయమున స్థూలశరీరమునుండి సూక్ష్మశరీరమును విడదీయుటలను కూడ చేయును. వ్యానవాయువు రక్తపు సారమును కలిగించును.

నాగము వెక్కిళ్ళు, త్రేనువుల నున్నూ, కూర్మము కండ్లను తెరచుటను, కృకరము ఆకలి దప్పికలను కలిగించుటను, దేవదత్తము ఆవలింతను, ధనంజయము మరణానంతరము శరీరమును విడదీయుటను చేయును. బ్రహ్మరంధ్రముగుండ తలయందుగల ప్రాణమును బయటకుపోవులాగున చేసికొని మరణించినవాడు తిరిగి జన్మింపడు.

ప్రాణము యొక్క రంగులు

ప్రాణము రక్తవర్ణముగాను పగడపురంగుగానువుండును. అపానము ఇంద్రగోపమనెడు పురుగుయొక్క రంగువలెనుండును. సమానవాయువు చిక్కటిపాలు స్ఫటికముల వన్నెవలెగాని లేక నూనెవన్నెతో గూడిన తళతళలాడు వన్నెతోగాని వుండును. ఉదానవాయువు ఆపాండర (పాలిపోయిన తెలుపు) వర్ణముగా నున్నూ, వ్యానవాయువు దీప కిరణపు వన్నెగానుండును.

వాయు ప్రవాహముల నిడివి

ఈ వాయు పూరితమగు శరీరముయొక్క సాధారణ నిడివి ఆరు అడుగులు. సాధారణముగ బయటకు విడచు వాయు ప్రవాహము యొక్క నిడివి 9 అంగుళము లుండును;