పుట:Pranayamamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ జీవితము నందలి ప్రతిక్షణమును, నీ యిచ్ఛాను సారము వినియోగించు కొనవచ్చును. కావున, దానిని సరియగు విధమున వుపయోగించుము.. శ్రీ జ్ఞాన దేవుడు, త్రిలింగస్వామి, రామలింగస్వామి మొదలగు మహయోగు లందరు, అనేక విధములుగ, ఈ ప్రాణశక్తిని వుపయోగించిరి. కావున నీవుకూడ ప్రాణయామమును అభ్యసించినచో వారివలె చేయగలవు. నీవు పీల్చునది ప్రాణశక్తియే. నెమ్మదిగను, ప్రశాంతముగను ఏకాగ్రత గల మనస్సుతోను గాలిని పీల్చుము. నీకు శ్రమ లేకుండ ఆపగలిగి నంతసేపు దానిని లోపల ఆపుము. ఆపిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము. ప్రాణాయామమును ఎట్టి స్థితియందు కూడా శ్రమతో చేయరాదు. ఈ శ్వాసయందు దాగియున్న ఆధ్యాత్మికమహాత్మ్యములను గుర్తించుము. యోగివి కమ్ము, ఆనందము, ప్రకాశము, మహాత్మ్యము లనెడి పరిసరములను గలవాడ వగుము.

ప్రాణవాదులు(హఠయోగులు) ప్రాణ తత్త్వమును మన స్తత్త్వము కంటె శ్రేష్ఠమైనదని చెప్పెదరు. నిద్రాసమయములో, మనస్సు లేకుండపోయినప్పుడు కూడ ప్రాణము వుండునని వారి సిద్ధాంతము. అందువల్లనే మనస్సుకంటె ప్రాణమే శ్రేష్ఠమనివారి అభిప్రాయము. కౌశీతకి,ఛాందోగ్యోపనిషత్తు లందు కొన్ని నీతికథలు గలవు. వాటిలో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములను నవి, నేను గొప్ప, నేను గొప్ప యని పోట్లాడుకొనును. కాని చివరకు, ప్రాణమే గొప్పదని తేలును. ప్రాణమనునది, అన్నిటికంటె పెద్దది. బిడ్డ గర్భమందు పడుట తడవుగ, ఈప్రాణశక్తి వానియందు ప్రవేశించును. ఇంద్రియములు, చెవులు, ముక్కులు మొదలగునవి ఏర్పడిన పిదప మాత్రమే ప్రవేశింప గలవు.