పుట:Pranayamamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూత్రనాళములు రక్తమునుండి వచ్చు మలిన పదార్థమును మూత్రాశయమునకు పంపును. అచ్చటినుండి యీ మలినపదార్థము మూత్రద్వారము ద్వారా బయటకు వెళ్ళిపోవును.

నాడీవిధానమునందు బృహస్మస్తిష్కము, అను మస్తిష్కము, కశేరుకనాడి, ఆనుకంపిక మజ్జాతంతువు లనునవి వుండును. ఇవిగాక మెదడునందు వినుట, చూచుట, రుచి చూచుట, వాసనచూచుట, మాట్లాడుట మొదలగు పనులు చేయుటకు అనేకములగు కేంద్రములుగలవు. వ్రేలిపై తేలు కుట్టినదనుకొనుడు. అందువలన కలిగెడి ఆ వేదనను జ్ఞానవాహిక మజ్జాతంతువులు వెన్నుపామువద్దకు మొట్టమొదట కొంపోయి, అచ్చటనుండి మెదడునకు కొంపోవును. అప్పుడు మెదడునందుండు మనస్సు దాని పరిణామమును శరీరముపై కలిగించును. ఎటులన, ఆ ఆవేదన మరల వెన్నుపామువద్దకు కొంపోబడును. అచ్చటినుండి గతివాహక మజ్జాతంతువుల ద్వారా చేతివద్దకు కొంపోబడును. అప్పుడు మన చేతివ్రేలిని తేలు కరచినదిగదా యని తలంచి, అచ్చటినుండి వ్రేలిని పైకి తీసికొందుము. ఇదంతయు ఒక రెప్పపాటులో జరిగిపోవును. ఈ బాధను అనుకంపిక మజ్జాతంతువులు పొట్ట, హృదయము, యకృత్తు, ప్లీహ మొదలగువాని ఆంతరి కేంద్రియములకు గొంపోవును.

ఇక ప్రాణపోషకమగు శుక్ర మేరీతిని తయారగుచున్నదో చెప్పెదను. అండకోశమునందుండు వృషణములు రెండింటిని స్రావక గ్రంధులందురు. ఇవి తేనెటీగ ఒక్కొక్క బిందువును ప్రోగుచేయురీతిని, రక్తమునుండి శుక్రమును ప్రోగుచేయును. అచ్చటినుండి ఈ ద్రవము (వీర్యము) రెండు శుక్రవాహికల ద్వారా శుక్రసంచయ తిత్తులు రెంటిలోనికి గొంపోవబడును.