Jump to content

పుట:Prabhutvamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

59

యున్నది. మహోదారమైన పద్ధతులు వెలసియుండు ఆంగ్లరాజ్యాంగసభలో సయితము ప్రభుత్వమున నుండు కక్షివారు రాజ్యాధికారుల మూలముగా ప్రవేశపెట్టుశాసనములే మెండు. అనధికారియగు శాసనసభ్యుడు ప్రవేశ పెట్టునట్టి శాసనము ఎప్పుడో యొకప్పుడుగాని కాన్పించదు. ఇది తప్పనిసరి. దినదినమును రాజ్యకార్యములను నడుపునట్టి వానికే రాజ్యవిషయములలో గల లోపాలోపములు చక్కగా బోధపడును. అతనికే ఎక్కడ నేసంస్కార మవసరమో సులభముగా తెలియవచ్చును. ఆకారణముచేత నేశాసనము చేయవలసినదియు నిర్ణయించుకొనుటకు అతనికే యుత్తమావకాశ మున్నది. దీనిని బురస్కరించుకొనియే మనదేశములో శాసనోపక్రమాధికారమంతయు ప్రభుత్వాధి కారుల చేతులలో నిడబడినది. ప్రజాపరిపాలిత రాష్ట్రములలోనే యీస్వాతంత్ర్య మధికారవర్గమునకు ప్రబలాయుధమనిన ప్రజాపరిపాలనకు నింకను పూర్తిగ దగ్గరజేరని హైందవభూమివంటి రాష్ట్రములలో దీని ప్రభావము వర్ణింపనక్కరయే లేదు.

అధికారశాఖకుగల మరియొక స్వాతంత్ర్యము శాసననిరోధము. శాసనకర్తలయి నట్టి వారొక శాసనమును చేసినను ఉత్తమాధికారిశాసనము నంగీకరించుట లేదని శాసనమును నిరోధింపవచ్చు ననుట యొకసిద్ధాంతము. ఈసిద్ధాంతము క్రమక్రమముగా కొన్నికొన్ని దేశములలో బలవిహీన మగుచున్నది. ముఖ్యముగా నాంగ్ల భూమిలో నుత్తమాధికారియైన రాజునకు గల యీస్వాతంత్ర్యము నేటిదినము సంపూర్ణముగా నష్టమయియున్న