పుట:Prabandha-Ratnaavali.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 27

సీ. పులుఁగురాయఁడు తమ్మికొలఁకుల చెలికాని బండిబోయనితోడి పాలివాఁడు,
పన్నగస్త్రీలకు బాలిండ్లపసుపాప మగిడింప నోపిన మగలమగఁడు
దంభోళి కొకయీకతాఁకుఁ గానిక సేసి యమృతంబుఁ దెచ్చిన యవఘళుండు
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ పల్లె నాఁకలిగొన్న భవ్యబలుఁడు
గీ. పక్షములు దాల్చి వచ్చిన పసిఁడికొండ
యట్టు విలసిల్లు మేటి వాహనము గాఁగ
నడచె హతశేషదేవసైన్యములు దాను
నసురకులమర్దనుండు జనార్దనుండు. (ఆం) 114

సీ. పైఁడిచాయలతోడి పక్షసంపుటముల మెలఁగు తేజులతేరు గలుగునతని,
మొకరితుమ్మెదలకు మకరందరసధార లొసఁగు పీఠమునఁ గూర్చుండునతని,
సత్కవీంద్రుల మానసములలో విహరించు కొమరాలి కింపులు గులుకునతని
దిక్కులు నాల్గింట లెక్కదప్పక యొప్పు నాననంబుల మాటలాడునతనిఁ
గీ. గనిరి యింద్రానలాంతక దనుజ వరుణ
పవన భవసఖేశాన పూర్వకము గాఁగ
నమరులందఱు మధుకైటభాసురేంద్ర
మదవిమర్దక నాభిపద్మజుని నజుని. (ఆం) 115

సీ. ప్రణవపీఠిక నెక్కి భాసిల్లు నే దేవి యామ్నాయహేమహర్మ్యాగ్రవీథిఁ?
జరియించు నే దేవి సహజారుణజ్యోతి రానందమూర్తియై బ్రహ్మనాడి?
నే దేవి ఠవణిల్లు నిచ్ఛాక్రియాజ్ఞాన శక్తిభేదమున విశ్వంబు నిండి?
తోడునీడయుఁ బోలెఁ దులకించు నే దేవి యెల్లకాలంబు విశ్వేశుఁ గూడి?
గీ. యట్టి దేవి జగన్మాత యఖిలవంద్య
నిఖిలవిద్యాకళేశ్వరి నిత్యమహిమ
నొకటియును శ్రీగళుని క్రేవ నుల్లసిల్లు
నలఘుకల్యాణశుభగాత్రి యద్రిపుత్రి. (ఆం) 116

గంగరాజు, చిరుమూరి [కుశలవోపాఖ్యానము] (ఇ)

క. హరిదాసుని వనవాసునిఁ
బరిచితపరమోపవాసు భాసురహాసున్
సురుచిర నిగమాభ్యాసున్
విరచిత కాశీనివాసు వేదవ్యాసున్. (ఆం) 117