పుట:Prabandha-Ratnaavali.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 ప్రబంధరత్నావళి

సీ. తల్లిదండ్రులతోడి తగు లొల్లకుండియు దల్లిదండ్రులతోడి తగులు వలచి,
కందర్పుమీఁది యక్కటికంబు సెల్లియుఁ గందర్పుమీఁది యక్కటిక మొదవి,
సంసారకేళి ప్రసక్తిఁ బోఁదట్టియు సంసారకేళి ప్రసక్తి గలిగి,
సగుణవిశేషయోజనము ల్ఘటించుయు సగుణవిశేషయోజనము మరఁగి,
గీ. సగము పురుషుండు కంజాక్షి సగము గాఁగ
నర్థనారీశ్వరాకృతి ననువుపఱచి
హరుఁడు తల్లింగమధ్యంబునందు నుండి
హరివిరించుల కంతఁ బ్రత్యక్షమయ్యె. (ఆం) 110

సీ. దైతేయకాంతల తళుకుఁగెమ్మోవుల వీటికాశ్రీలకు వీడుకోలు,
వేల్పుటిల్లాండ్రక్రొవ్విదపుఁ జన్నులమీఁది యలువుఁబయ్యెదలకు నిలువనీడ,
విశ్వజగత్త్రయీ విజయలక్ష్మీగాఢ బిరుదోత్సవములకుఁ బెండ్లివిందు,
పరిపంథివాహినీ పరిచితపరిభవ ప్రాప్తి సంకటముల పాయుత్రోవ,
గీ. సేసి యెయ్యది విలసిల్లుఁ జిత్రమహిమ?
నది ప్రయోగింప నెత్తె నయ్యచ్యుతుండు
విలయసమయ సముద్భూత విపులదహన
దారుణస్పర్శనంబు సుదర్శనంబు. (ఆం) 111

ఉ. నన్నయభట్టుఁ గావ్యరచనావిధిఁ, దిక్కనసోమయాజి న
చ్ఛిన్న మహత్త్వ సంవిహితశేముషి, నెఱ్ఱయప్రెగ్గడన్ సము
త్పన్ననవప్రబంధరసభావన, నింపునఁ బ్రార్థనాంజలుల్
మున్నుగ నాత్మలోఁ దలఁతు మువ్వుర మువ్వురఁ బోలు పుణ్యులన్.[1] (ఆం) 112

సీ. పులినంబు తొలుచూలు పుండరీకాక్షుని యవతారభేదంబు కవులరాజు
బహుపురాణగ్రంథ భారతసంహితా పరిగుంభనక్రియా పండితుండు,
కఱ్ఱివన్నియవాఁడు కౌరవాన్వయకర్త శ్రుతు లేర్పఱించిన సూత్రధారి,
సిద్ధనీవారముష్టింపచాధ్యక్షుండు శుకునికూరిమితండ్రి సకలవేది,
గీ. కాళికేయుండు యోజనగంధిపట్టి
తత్త్వనిర్ణేత ఘనతపోధర్మరాశి
నైమిశారణ్య మునిసభాభూమికెలమి
నేఁగ నొకనాఁడు వ్యాసమునీశ్వరుండు. (ఆం) 113

  1. నిశ్శంకుని కొమ్మయ శివలీలావిలాసములోనిది