పుట:Prabandha-Ratnaavali.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19


దీనింబట్టి నన్న మభట్టారకునకు నూడేండ్లకుఁ బూర్వమే యాంధ్రకవితా సతి వర్ధిల్లుచున్నదని స్పష్ట మగుచున్నది.

శ్రీ వీరభద్రరావుగారుగాని, మఱియెవరుగాని నన్నిచోడఁడు నన్నయ కంటెఁ ద్రాచీనుఁ డని చెప్పఁజూచుటకును, గావచ్చు నని లోకము విశ్వసిం చుటకు నీ పద్యమే ప్రధానాధారముగా నున్నది. శ్రీ రామకృష్ణ కవి గారు ప్రచురించిన కుమార సంభవముద్రితప్రతిలో నీపద్య మిట్లున్నది. 1909 సం|| దీనిని ముద్రించినారు. అప్పు డి పద్యమునకు వారు పాఠాంతరమును జూపలేదు, వారి యచ్చునకు మాతృక యెక్కడిదో చెప్పను లేదు. కవిగారు కుమార సంభ వము రెండవ భాగపుఁ బీఠిక లో నిట్లు వాసినారు. "కుమారసంభవ ప్రతులలో నొకటి నాకు నైజాము రాజ్యమునఁ బ్రాచీనకా సాసన శోధనార్ధము పోవుచుండఁగాఁ గర్ణాట దేశముననే లభించెను. తక్కినవి రెండును శుద్ధ ద్రవిడ దేశముననే యగపడెను" ద్రవిడ కర్ణాట దేశ ముందు మూఁడు ప్రతులు దొరకినను నచ్చులో! బెక్కులు గ్రంథపాతములుండుట వింతగానన్నది ఆ మూఁడు ప్రతులు నొక్క మాతృకకే పుత్రిక లాయేమి ? కాకున్నచో నవి పాఠభేదములు లేకయు సమాన గ్రంథపాతములు గలిగియు నుండుట వింతగదా ? పట్టిక లో ముఖ్య పాఠభేదము లని వారు చూపినవి ప్రాయికముగా ముద్రణమం దర్థానుగుణముగాఁ జేయఁబడిన సంస్కారములకు వ్రాత ప్రతిలో నున్న తప్పుపాఠములుగా గోచరించుచున్నవి. కుమార సంభవ ప్రతులయొక్కయుఁ బాఠముల యొక్కయు రహస్యము లింకను బయల్పడవలసియే యున్నవి. కాని తంజాపురపు సరస్వతీపుస్తక భాండాగారమునఁ దాటియాకులపై ప్రొయఁబడిన కుమార సంభవపుఁబ్రతి యున్నది. అక్కడఁ దక్క నింతవఱకుఁ బ్రత్యంతర మెక్కడను మనకుఁ గనరాదు. వినరాదు. ఆ పుస్తకముల్ పై పద్యమిట్లున్నది.

“క. మునుమార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
గును నిలిపి రంధ్రవిషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్ ."

కవిగారికి "చన సత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్" అన్న పాఠ మెక్కడనుండి వచ్చినదో ! వా రింక నెక్కడి ప్రతీసంపాదించినారో , ప్రథమ భాగమును ముద్రించునప్పటికి వారీతంజాపూరు బ్రతి నెఱుఁగనే యెఱుఁగరు