పుట:Prabandha-Ratnaavali.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాకినీబ్రహ్మరాక్షసభూతబేతాళ కూశ్మాండధారిణిక్రూరశస్త్ర
దారిద్ర్యదుర్భిక్షదారుణదుస్స్వప్న దుశ్శకునోత్పాతదుష్టమృత్యు
గీ. ఘోరసంసారభవభయాపారదుఃఖ
సమితి నిర్జించి రక్షింపఁ జాలు నీదు
భవ్యపంచాక్షరీమంత్ర పఠనశక్తి
భానుశతకోటిసంకాశ! పాణికేశ! (ఆం) 576

సీ. తిమిరభూతముసోఁకు దెలియ జగత్త్రయీ లలన దాల్చిన రక్తతిలక మనఁగ,
సఖ్యంబునకు నిశాశబరి యిచ్చినఁ బ్రాచి పాటించు గురివెంద బంతి యనఁగఁ,
దోయధి వెడగ్రుంకఁదోఁచు పురందర కుంభినీ సింధూర కుంభ మనఁగఁ,
గులిశాయుధుని పెద్దకొలువునఁ జెన్నొంద దీపించు మాణిక్యదీప మనఁగఁ,
గీ. గుముదినీ రాగ రససిద్ధ గుటిక యనఁగఁ
గాము జనరంజనౌషధి కబళ మనఁగఁ
బొడుపుఁగెంపున బింబంబు పొలుపు మిగులఁ
జంద్రుఁ డుదయించెఁ గాంతి నిస్తంద్రుఁ డగుచు. (ఆం) 577

సీ. తుహినధాత్రీధరోత్తుంగగాత్రస్ఫూర్తిఁ బరిపూర్ణచంద్రికాప్రభలు మాయఁ,
గఠినబంధురతరస్కందఘంటాధ్వని నదిరి దిశావలి యెదులు మ్రోయఁ,
బవిచండనిష్ఠుర పటుపాదఖుర హతిఁ బఱిపఱియై మహీభాగ మగల,
వరభోగ భోగీంద్ర వాల వాతోద్ధతిఁ జెదరి ధారాధరశ్రేణు లవియ,
గీ. వర్ణితాయత శృంగతీవ్రక్షతములఁ
బెల్లుకొని పద్మజాండంబు బెల్లు లొలయఁ
జండగతి వచ్చు కైలాసశైల మనఁగ
నెసఁగు పడివాగెతో వృషభేంద్రుఁ డమరె. (ఆం) 578

చ. ద్విగుణసరోజమయ్యె సుదతీజనచారుముఖవ్రజంబుచేఁ
ద్రిగుణిత మీనమయ్యె యువతీజనలోచనపంక్తిచేఁ జతు
ష్ప్రగుణిత కోకమయ్యె రుచిరప్రమదాననరాజిచే నదం
బగణిత షట్పదప్రకరమయ్యె సతీకుటిలాలకాలిచేన్. (ఆం) 579

చ. నెఱఁకులయందుఁ గ్రిక్కిఱిసి నిండిన పొంపిరి నిక్కుపట్లు ద
గ్గఱుటయు నూరడించి తమకంబున నెవ్వరికన్న వేడ్కఁ ద
త్తఱ వెస మీచి పట్టుకొను తౌలము లొండొరుఁ జుట్టుముట్టి త
మ్మెఱుఁగని సంగమక్రియ మహీతలనాథుఁడు రాజపుత్త్రియున్. (ఆం) 580