పుట:Prabandha-Ratnaavali.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 52

మ. జలనైర్మల్యవిధాయి వింధ్యగిరి శిక్షాకేళిసంశీలుఁ డి
ల్వల దైత్యావరజన్మగర్వదళనావంధ్యక్షుధాభీలుఁ డు
జ్జ్వలతేజోనిధి కల్పితాయత పిపాసారిక్తవారాశి మం
జుల హేలాగతిఁ దోఁచెఁ గుంభజుఁ డురుస్తోత్రైకపాత్రోన్నతిన్. (ఆం) 242

చ. తగులము పెక్కువం బురి సుధాధవళోన్నత హర్మ్యరేఖలన్
మగలునుఁ దారు మచ్చరపుమచ్చికమై వలరాచవేడ్కలన్
సొగియు వధూజనంబుల తనూతనుఘర్మము లార్చు నిచ్చలున్
గగనతరంగిణీ కమలగంధసుగంధ మరుద్విహారముల్. (ఆం) 243

చ. తలిరులు దోచె నే తరుల దట్టములై? నన లే ధరారుహం
బుల దలసూపె మున్ను? వలిమొగ్గల నొప్పెడు నే యనోకహం
బులు? నవగుచ్ఛరాశి నగము ల్విలసిల్లెడు నెవ్వి? యన్నియున్
గలుగుట నే మహీజములు గన్నులపండువు లయ్యె? నామనిన్. (ఆం) 244

మ. తెర యెత్తించిరి దేవదానవగురుల్దీక్షాకళాకోవిదుల్
తరుణీరాజతనూభవాంతరమునన్ దట్టంపుఁ గౌశేయమున్
తెర యెత్తించెను వారలిద్దఱ మనోదేశంబులన్ గాముఁడున్
సరి నన్యోన్యముఖేందుమండలదిదృక్షాకౌతుకాంభోనిధిన్. (ఆం) 245

సీ. తెలపుల దాయ జారులకుఁ గట్టనియిల్లు బలితంపుఁజోరుల బ్రదుకుఁదెరువు,
నలుపుల మొదలు రే నెలఁతకస్తురిపూఁత యఖిలంబుఁ గప్పెడు నరిదిముసుఁగు,
గుణములమీఁదటి గణనవిజ్ఞానంబు మఱుఁగు సందియముల మనికిపట్టు,
కౌశికంబులచూపు క్రవ్యాదవితతి మ న్నియము జక్కవదొల భయముప్రోఁక,
గీ. యనఁగఁ గలవస్తువుల నెల్లఁ దనమయంబ
కాఁగఁ జేయుచు దెసలు నాకసము నిండ
సకలజనులకు మతుల విస్మయము లడర
నంధకార మంతంతకు నగ్గలించె. (ఆం) 246

శా. ధన్యంబై పితృదేవతానివహ ముద్యత్ప్రీతి నర్తింపఁ బ
ర్జన్యాచార్యుఁడు భార్గవుండు శ్రుతిమంత్రంబుల్ పఠింపంగఁ బ్రా
ధాన్యం బొప్పఁగ శైలరాజసుత యత్యాసక్తి వీక్షింపఁగాఁ
గన్యాదాన మొనర్చెఁ బాణుఁ డనురాగస్ఫూర్తిఁ బ్రాద్యుమ్నికిన్. (ఆం) 247