పుట:Prabandha-Ratnaavali.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 ప్రబంధరత్నావళి

గీ. గురులపంపున వక్షోజభరము గదలఁ,
జెలువు వీక్షించి యొక్కింత సిగ్గువడుచుఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
నతివ లాజలు వోసె సప్తార్చియందు. (ఆం) 237

సీ. ఘనపక్షవిక్షేపజనితవాతాహతిఁ బర్వతశ్రేణులు పాదు గదల,
విపులాస్యకర్ణికావిర్భూతదీప్తుల మలయాద్రి యవ్వల వెలుకఁ బాఱ,
శతకోటిశతచండజవభవారవముల శరధులు ఘూర్ణిల్లి బరలు గడవ,
వితతాద్భుతాపాదివిభ్రమోత్థిత కాంతి దెసల హోమద్యుతి దీటుకొనఁగ,
గీ. సిద్ధచారణగణనుతశ్రీఁ దనర్చి
మింటఁ బరఁగు ఱెక్కలతోడి మేరువనఁగ
వచ్చెఁ దన రాక కఖిలంబుఁ బిచ్చలింపఁ
బక్షిదేవుండు పుండరీకాక్షుకడకు. (ఆం) 238

సీ. చంద్రమండలములే జలజాతములు గాక కాకున్న నలులేల కాఁపులుండు?
నెలదమ్మితూఁడులే యలరుఁదీగెలు గాక కాకున్న నీ కోరకములు గలవె?
క్రొక్కారుమెఱుఁగులే కుసుమాస్త్రములు గాక కాకున్న నీవిండ్లు గలగ వచటఁ?
గనకకుంభంబులే ఘనచక్రములు గాక కాకున్నఁ దరగలఁ గదియనేల?
గీ. ననుచు వదనాలకములు బాహానఖములుఁ
బొలయుచూపులఁ బొమలుఁ జన్నులును వళులుఁ
జూచి జనములుఁ దమ్ము సంస్తుతులు సేయ
వఱలుదురు దత్పురంబున వారసతులు. (ఆం) 239

ఉ. చీటికిమాటికిన్ మొగుపుఁజేతులు మౌళి ఘటించి మ్రొక్కెదన్
హాటకగర్భుబోటికి మహాకవికాంక్షితకల్పకాటవీ
వాటికిఁ దారకాహృదయవల్లభమంజులపుష్పమంజరీ
జూటికి వల్లకీస్ఫురితశుద్ధవరాటికి వాగ్వధూటికిన్. (ఆం) 240

చ. చెలువము లొప్ప రాజనపుఁజేలకుఁ గావలియున్న కాఁపుఁగూఁ
తుల నిడువాలుఁగన్నులును దోరపుఁజన్నులుఁ జూచి ధైర్యముల్
పలపలనైన మందగతులన్ జనుచుండుదు రంగజాస్త్రముల్
దలముగఁ దాఁక నధ్వగులు దన్నగరాంతికమార్గభూములన్. (ఇ) 241