పుట:Prabandha-Ratnaavali.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 ప్రబంధరత్నావళి

ఉ. ధన్యవిభూతి శోభితుఁడు దామరసేక్షణుఁ డొత్తె నూర్జిత
ధ్వన్యతులోగ్రతా దళిత దానవసైన్యము ధూతభూత చై
తన్యముఁ దోషితేంద్రముఖ దైవతసంస్తుతిమాన్యము న్నదీ
జాన్యుదరాంతర స్థగిత సన్నుతజన్యముఁ బాంచజన్యమున్. (ఆం) 248

సీ. ధూర్జటి కోపాగ్ని ధూళిగాఁ గ్రాఁగిన నాఁ డేల నీ యమ్ము వాఁడి లేదు?
వాఁడికోఱల రాహు వడిఁ దోలి కఱచిన నాఁ డేల నీ రశ్మి వేఁడి లేదు?
శాపంబు శ్రీరామభూపాలుఁ డిచ్చిన నాఁ డేల కూయవో పోఁడిగాను?
చనుపకముల కర్గి కనుకని డుల్లిన నాఁ డేల మ్రోయరో? నేడు మీరు
గీ. మగువఁ బాయు టెఱిఁగి మగఁటిమి వాటించి
యేయఁ గాయఁ గూయ మ్రోయ నగునె?
మదన! చంద్ర! పికమ! కొదమతుమ్మెదలార!
నాఁడు నాఁడు నాఁడు నాఁడు లేరె? (జ) 249

సీ. నిర్భర వాంఛాఘనీభూత మానస భంగీకృతా దయాలింగనంబు,
సురచిర నఖరాగ్రపరిరంభితాల కం బాస్వాద్యమానాధరామృతంబు,
బాహ్యక్రియా సార్ద్రభావనాళీకంబు వితత మృదూరూరువేష్టనంబు,
వర్ధిత మధురోక్తి వాచాలవదనంబు ఘర్మాంబుకణగణాకలితగండ,
గీ. మతి తరంగిత నిశ్వాస మాత్తపులక
మరుణితాక్రాంత లోచనాంబురుహయుగళ
మగు మనోహరఖేలనం బతిశయిల్లఁ
దనరెఁ గామినీకామకదంబకంబు. (ఆం) 250

సీ. పడఁతికన్నుల యొప్పుఁ దడవుచో నది యెంత వెలిదమ్మిఱేకుల విలసనంబు?
పొలఁతినెన్నడ పెంపు పొగడుచో నది యెంత కలహంసముల యానగౌరవంబు?
ఉవిద నెన్నడుముతో నుపమింప నది యెంత కొఱనెల నెలకొన్న నెఱసుకలిమి?
వనిత యూర్పులతావి కెనపోల్ప నది యెంత యరవిరులందలి సురభిమహిమ?
గీ. లలనకరివంక బొమలయొప్పులు గణించు
చోట నది యెంత వెడవింటి సోయగంబు?
కాంత తనుకాంతి నరసేయ నెంతమాత్ర
వాలు మెఱుఁగుల సౌభాగ్యవైభవంబు? (ఆం) 251