పుట:Prabandha-Ratnaavali.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 51

థుల దెసఁ గూర్చి యత్తఱిని తోడివయస్యలు చూడ సిగ్గునన్
జెలువెసనారఁగ న్గురులఁ జిక్కులు దీర్తురు సిద్ధకామినుల్. (ఆం) 232

సీ. కుసుమంబుఁబోలి పొల్పెసఁగు పొక్కిలి డిగ్గఁ గుఱుపట్టుపుట్టంబు నెఱికఁ గట్టి,
కమనీయనవరత్నఖచితమై యొప్పు పసిండిపీఠమునఁ గూర్చుండఁబెట్టి,
గన్నెరాకుశరంబు కరపల్లవమునకు రక్షాప్రయోజనార్థముగ నిచ్చి,
దీవింఛి కాశ్మీరతిలకమధ్యంబునఁ బుణ్యాక్షతలఁ జిట్టిబొ ట్టమర్చి,
గీ. భాగ్యసౌభాగ్యవతియైన భామ యోర్చు
చన్నుఁగవ భారమునఁ గౌను జలదరింపఁ
దివిచి కొనగోరఁ దోఁచి బిందువు విదిర్చి
బాణతనయకు నంటె సంపంగినూనె. (ఆం) 233

సీ. కుసుమకోదండుండు గుణవంతుఁడగుటెల్ల యళులార! మీ ప్రాపు కలిమిఁ గాదె!
మరుని యెక్కుడు పెంపు మహిమీఁదఁ జెప్పుట కీరంబులార! మీ పేరఁ గాదె!
సంకల్పజన్ముండు సప్రాణుఁ డగుటెల్ల మలయానిలంబ! నీ మహిమఁ గాదె!
మీనకేతనుకీర్తి మిన్నందు కొనుటెల్ల శీతమయూఖ! నీ చెలిమిఁ గాదె!
తే. బాలఁ గారింపఁదగదని పలుకఁదగదె!
యేడుగడయును మీర కాలెంత దవ్వు
మాకుఁ బుష్పాస్త్రుఁ? డంచు ననేకనుతుల
మధుపశుకమందపవమానవిధులఁ దలఁచి. (జ) 234

శా. క్షామక్షామము గీకటప్రకటవక్షఃపీఠమున్ బాండుర
క్షా మిశ్రావయవంబునైన వికటాకారంబుతో నవ్వుకై
చాముండాకరతాళకుక్షివలయస్థానంబుగా నుజ్ఝిత
హ్రీముద్రంబుగఁ బేరణీవిధము నర్తించెన్ మహాభృంగియున్. (ఆం) 235

ఉ. ఖంజననేత్ర చన్నుఁగవ కంజముఁ బొంగఁగ ధీరమేఖలా
శింజితకంకణక్వణనజృంభణ మొప్పఁగఁ గౌను నిక్కఁగా
వ్యంజితబాహుమూలముగ హర్షము లజ్జఁ దిరస్కరింపఁగా
నంజలి యెత్తి నించె విభూనౌదల నిర్మలమౌక్తికాక్షతల్. (ఆం) 236